rakul preeth singh punch on mediaసినీ పరిభాషలో హీరోయిన్లకు ఇండస్ట్రీలో కొన్ని ‘బ్రాండ్ నేమ్స్’ వచ్చేస్తుంటాయి. ఒక హీరోయిన్ నటించిన సినిమాలన్నీ వరుసగా హిట్ అయితే ‘గోల్డెన్ లెగ్’ అని, ఫట్ అయితే ‘ఐరన్ లెగ్’ అని పిలవడం సహజమే. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా విజయం తర్వాత రకుల్ టాలీవుడ్ లో ‘గోల్డెన్ లెగ్’గా అవతరించింది. అయితే ఇదే పలకరింపుపై మీడియా వర్గాలు రకుల్ ప్రీత్ సింగ్ ను ప్రశ్నించినపుడు… ఈ బ్యూటీ వేసిన ‘పంచ్’లకు ‘అబ్బో…’ అనడం మీడియా జనాల వంతయ్యింది.

“తాను గోల్డెన్ లెగ్ కాదు, ఐరన్ లెగ్గూ కాదు… తనకు మామూలు కాళ్లే ఉన్నాయి… మనుషులకు ఉన్నట్టు రెండు కాళ్ళే ఉన్నాయి… కావాలంటే చూడండి…” అని చెప్పడం మీడియా వర్గీయులతో నెటిజన్ల నవ్వులకు కారణమైంది. తాను నెంబర్ గేమ్ ను కూడా ఇష్టపడనని, ఒక సినిమాలో కొందరు బాగా నటిస్తారు, అదే బెస్ట్ అని చెప్పడానికి కొలమానం ఉండదని, తనకు తెలిసినంత వరకు గుడ్, బెటర్ ఉంటాయని, ఇంకా అద్భుతంగా ఉంటే అది బెస్ట్ అయి ఉంటుంది తప్ప ప్రోగ్రస్ రిపోర్టులా ర్యాంకులు ఉండవని కాస్త వేదాంత ధోరణిలో కూడా వ్యాఖ్యానించింది.

తాను నిజ జీవితంలో సినిమాల్లోని ఏదో ఒక పాత్రలా ఉండనని, డబ్బులు ఖర్చు చేయడంలో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాలోని ప్రార్ధనలా, ఎనర్జీలో ‘బ్రూస్ లీ’లోని పాత్రలా, అవతలి వారిని ఏడిపించడంలో ‘లౌక్యం’లోని చంద్రకళలా, తెలివితేటల్లో ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలోని పాత్రలా ఉంటానని… చెప్పిన రకుల్, ‘సరైనోడు’ సినిమా పాత్రలో ఏ లక్షణాలను చెప్పలేకపోయింది. ఒక సినిమా విజయం సాధించేందుకు చాలా మంది కష్టపడతారని, ‘సరైనోడు’ సినిమాకు వస్తున్న ప్రేక్షకుల స్పందనతో సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చింది. అయితే ఈ ‘సరైనోడు’ సంతోషం ఎన్ని రోజులు అనేదే శేష ప్రశ్న… అంటున్నారు నెటిజన్లు.