Rakul Preet Singh comments on Menనటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలతో “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమాలోని ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా’ అన్న డైలాగ్ బాగా హైలైట్ అయ్యింది. దీంతో సినిమా విడుదలైన తర్వాత కూడా మరో వివాదం ఎక్కడ చుట్టుముడుతుందోనని భావించిన ‘కింగ్’ నాగార్జున, ఏకంగా ఆ డైలాగ్ నే సినిమా నుండి కట్ చేయించినట్లుగా తెలుస్తోంది. అంతలా మహిళామణులు తన సత్తా చూపించారు. అలాగే ఎవరి భావాలు వారు వ్యక్తపరిచారు. ఈ క్రమంలో పురుషులపై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా వెలువడ్డాయి.

“రారండోయ్ వేడుక చూద్దాం” సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించే క్రమంలో… తనను ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా’ అని అడిగితే… ‘అబ్బాయిలే విషపూరితం’ అన్న సమాధానాన్ని చెప్తానని, మహిళల వలన హాని మాత్రమే జరుగుతోంది, అబ్బాయిల వలన ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారని తనదైన స్టైల్లో చెప్పుకొచ్చింది రకుల్. రకుల్ మాటల్లో కొంత వాస్తవం లేకపోలేదు గానీ, చలపతిరావు మాదిరే రకుల్ కూడా అందరినీ జనరలైజ్ చేసి చెప్పింది.

మరి రకుల్ ఇంతటి వ్యాఖ్యలు చేసిన ఏ ఒక్కరూ స్పందించకపోవడం మహిళల్లోని తెగింపును, పురుషుల్లోని తేలికతనాన్ని ప్రతిబింబిస్తుంది. కూతుళ్ళు లేరా, అమ్మలు లేరా, భార్యలు లేరా అంటూ చలపతిరావును ప్రశ్నించిన అదే నోళ్లకు సోదరులు లేరా, నాన్నలు లేరా, భర్తలు లేరా… అనే ఎదురుదాడి మాత్రమే రాలేకపోతోంది. అదే మహిళలకు, పురుషులకు ఉన్న తేడాను చూపిస్తోంది. బహుశా ఇవే వ్యాఖ్యలు ‘అమ్మాయిలు విషపూరితం’ అనే ఎవరైనా అంటే చలపతిరావుకు మించి హైలైట్ అయ్యేవారేమో కదా!

తనకు భాష రాదు, అందుకే నాడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు అర్ధం కాలేదు అంటూ సర్దిచెప్పుకున్న రకుల్, అదే అచ్చ తెలుగు ‘అబ్బాయిలు విషపూరితం’ అని మాత్రం బాగానే అన్నారు అంటే… నిజంగానే నాడు రకుల్ కు తెలుగు భాష అర్ధం కాలేదని నమ్మాలా? లేక ఇంతలోనే ఒక రోజులో తెలుగు నేర్పే పుస్తకం కొనుగోలు చేసి, పూర్తిగా పఠనం చేసి… అబ్బాయిలపై ఈ కామెంట్స్ చేసారా..? ఎంతైనా నటులు కదా… ఆన్ స్క్రీన్ పైన అయినా… ఆఫ్ స్క్రీన్ పైన అయినా నటన ఇరగ్గొట్టేస్తారనడానికి ఇదొక నిదర్శనం… కాదంటారా..!?