Rakshasi Theatrical Trailer Poornaబాక్సాఫీస్ వద్ద హార్రర్ సినిమాలకుండే క్రేజ్ ప్రత్యేకమైనది. అందుకే ఇటీవల కాలంలో ఈ సినిమాల మేకింగ్ ఎక్కువైపోతోంది. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలచన’ అన్న చందంగా హార్రర్ సినిమాలు ఎక్కువవుతున్న కొద్దీ, ప్రేక్షకులలో భయం తగ్గుతూ, చిరాకు పెరుగుతూ వస్తోంది. తాజాగా విడుదలైన “రాక్షసి” ధియేటిరికల్ ట్రైలర్ కూడా ఇదే రకమైన చిరాకును ప్రేక్షకులకు కలిగిస్తోందని అని చెప్పవచ్చు. ఈ ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా భయం కలుగుతుంది… ఎందుకంటే పొరపాటున ఈ సినిమాకు వెళితే ఏంటా అన్న భయం..!

అవును… ఈ “రాక్షసి” ట్రైలర్ చూసి సినిమాకు వెళ్ళాలనుకుంటే… ఖచ్చితంగా భయపడాల్సిందే. ఎందుకంటే ధియేటర్ కు వెళ్ళిన ప్రేక్షకులు బుక్కవ్వడం ఖాయమన్న సంకేతాలను ఈ ట్రైలర్ ఇస్తోంది. రవిబాబు దర్శకత్వం వహించిన ‘అవును’ సినిమాల సిరీస్ ఫేం పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను భయపెట్టడం కన్నా, హార్రర్ కాబట్టి భయపడాలేమో అన్న అనుభూతులను కలిగిస్తుంది. పరమ రొటీన్ హార్రర్ సినిమాగా కనపడుతున్న ఈ ట్రైలర్లో నిర్మాణపు విలువలు కూడా లోపించాయి.

90 సెకన్ల పాటు సాగిన ట్రైలర్ ను చూడడమే, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే విధంగా మారిన నేపధ్యంలో… ఇక 120 నిముషాలకు పైగా ఉండే సినిమాను భరించడం ప్రేక్షకులకు ఎంతవరకు సాధ్యం? ట్రైలర్ తో పాటు విడుదల చేసిన రెండు వీడియో సాంగ్స్ లలో కూడా నిర్మాణపు విలువలు పూర్తిగా లోపించాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈ “రాక్షసి” సినిమా ప్రేక్షకుల పాలిట “రాక్షసి”గా మారుతుందేమో అన్న సంకేతాలను అయితే ట్రైలర్ కలిగిస్తోంది.