Arun Jaitley Sitaram Yechury,Arun Jaitley Sitaram Yechury Rajya Sabha,Arun Jaitley Sitaram Yechury Special Status Bill,Arun Jaitley Sitaram Private Billఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కాల్సిన “ప్రత్యేక హోదా”పై రాజ్యసభ అట్టుడికిపోయింది. కేవీపీ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ మళ్లీ పట్టుబట్టడంతో మొదలైన రగడ, స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలతో కాంగ్రెస్ నేతలు రాజ్యసభను హోరెత్తించారు. ఇది రాజ్యసభ రూల్స్ కు విరుద్ధమని చెప్పిన డిప్యూటీ ఛైర్మన్ కురియన్, ఈ శుక్రవారం చర్చకు తీసుకువద్దామని సర్దిచెప్పే ప్రయత్నం చేసారు. అందుకు సమ్మతించని కాంగ్రెస్ నేతలు యధావిధిగా ఆందోళన కొనసాగించారు.

ఓ పక్కన ఇది కొనసాగుతుండగానే, కురియన్ – సీపీఎం నేత సీతారాం ఏచూరి మధ్య ఆసక్తికర వాదన చోటుచేసుకుంది. కురియన్ వ్యాఖ్యలపై సీతారాం ఏచూరి స్పందిస్తూ… సమస్యను పరిష్కరించాలని అనుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని, ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తున్నట్టు గతంలో ప్రధాని ఇక్కడే ప్రకటించారని, దానిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామని, ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ ప్రకటిస్తే సమస్య పరిష్కారమవుతుందని, అధికార పార్టీని అందుకు ఆదేశించాలని సూచించారు. రూల్స్ ప్రకారం ప్రైవేటు మెంబర్ బిల్లుపై ఓటింగ్ జరగలేదని, అందుకే ప్రస్తుతం ఈ ఆందోళన అని చెప్పగానే, కాంగ్రెస్ నేతలు మళ్లీ నినాదాలు ప్రారంభించారు.

అయితే దీనికి ప్రతిగా వివరణ ఇచ్చిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ… ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా బిల్లు బడ్జెట్ బిల్లు అని, దీనిని లోక్ సభలో ప్రవేశపెట్టాలి తప్ప రాజ్యసభకు చర్చించే అధికారం లేదని తెలిపారు. ఇది రాజ్యాంగంలో ఉందని… ఏపీకి ప్రత్యేక హోదా బిల్లు ద్రవ్య బిల్లు అని, ద్రవ్య బిల్లుపై చర్చించేందుకు రాజ్యసభకు అధికారం లేదని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ తెలిపారు. దీంతో మళ్ళీ సీతారాం ఏచూరీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

అరుణ్ జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఏపీకి ప్రత్యేక హోదా బిల్లు ద్రవ్య బిల్లు అయితే డిప్యూటీ ఛైర్మన్ బిల్లును ఎందుకు స్వీకరించారని ఓ లాజికల్ ప్రశ్నను సంధించారు. దీనిపై స్పందించిన కురియన్, చర్చను విన్న తరువాత అది ద్రవ్యబిల్లా? కాదా? అన్నది ఆఫీస్ నిర్ణయిస్తుందని, ఈ రోజు మాత్రం ఈ బిల్లుపై చర్చకు అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు.