Rajnath singh interferes in chandrababu naidu Niti aayog speechన్యూఢిల్లీలో నీతి ఆయోగ్ నాలుగో పాలకమండలి సమావేశం జరుగగా, 2022 నాటికి దేశాభివృద్ధి దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోపన్యాసం చేయగా, ఆపై అక్షర క్రమంలో తొలుత ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. తమ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరగడం లేదని, కేంద్రం రాష్ట్రాభివృద్ధికి ఏ మాత్రం సహకరించడం లేదని మోడీని పక్కన పెట్టుకుని చంద్రబాబు నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు.

ఏపీలో సేవారంగం విస్తరిస్తోందని, సేవారంగం వృద్ధిని పరిగణనలోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఏకపక్షంగా రాష్ట్ర విభజన జరిగిందని మరోసారి గుర్తు చేసిన బాబు,, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చడం లేదని, అసలు హామీలు నెరవేర్చే ఉద్దేశం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదని తీవ్రంగా స్పందించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చకుంటే, ప్రజలు కేంద్రంపై విశ్వాసాన్ని కోల్పోతారని హెచ్చరించారు.

పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తికి నిధులు సమకూర్చాలని డిమాండ్ చేసిన చంద్రబాబు, పోలవరం బాధితుల పునరావాసానికి కావాల్సిన నిధులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. అమరావతి నిర్మాణానికి నిధులు ఆగిపోయాయని, తాము లెక్కలు చెబుతున్నా, లెక్కలు చెప్పడం లేదని ఆరోపించడం ఎంతవరకూ సబబని చంద్రబాబు ప్రశ్నించారు. రెవెన్యూ లోటు విషయంలో గతంలో ఇచ్చిన హామీని విస్మరించారని నిప్పులు చెరిగిన ఆయన, గతంలో ఇచ్చిన అన్ని హామీలనూ అమలు చేయాలని అన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి ఇలా తీవ్రంగా స్పందిస్తున్న వేళ కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అడ్డుకున్నారు. తన ప్రసంగంలో కేంద్రం వైఖరిని విమర్శిస్తున్న చంద్రబాబును 7వ నిమిషం అడ్డుకున్నారు. ఇది విమర్శలు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సమావేశం కాదని, వచ్చే ఐదేళ్లలో జరగాల్సిన అభివృద్ధిపై మాట్లాడాలని, సూచనలు చేయాలని రాజ్ నాథ్ కోరారు. అభివృద్ధిని గురించి మాట్లాడకుండా, విమర్శలే చేయాలంటే మరో వేదికను చూసుకోవచ్చని అన్నారు. తాను అభివృద్ధి గురించే మాట్లాడుతున్నానని, ప్రజా సమస్యలు కేంద్రానికి పట్టడం లేదని ఒకింత ఆగ్రహంతో మాట్లాడిన చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు.