Rajinikanthi political announcement2017 డిసెంబరు 31న తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ తరువాత అడపాదడపా రాజకీయ వ్యాఖ్యలు తప్ప రాజకీయంగా చేసింది ఏమీ లేదు. అయితే ఇప్పుడు తమిళనాడు శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగానే సంక్రాంతిలోపు పార్టీ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చెయ్యని రజినీకాంత్ వచ్చే శాసనసభ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తారని తెలుస్తోంది.

రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది ఆఖరులో కొత్త పార్టీ పేరు, జెండా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. సంక్రాంతి కానుకగా కూడా పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలూ ఉన్నాయి. రాష్ట్రంలో కరుణానిధి, జయలలిత లేని శూన్యతను వాడుకుని తమిళ నాట ప్రబల రాజకీయ శక్తిగా ఎదగాలని రజినీకాంత్ ఆసక్తిగా ఉన్నారు. మొన్న ఆ మధ్య మోదీ, అమిత్‌షాలను కృష్ణార్జునులతో పోల్చడం, కశ్మీర్‌ పునర్విభజనపై బీజేపీ సర్కార్‌ను అభినందించడం వంటి ఘటనలతో ఆయన బీజేపీలో చేరతారనే వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఇప్పుడు రెండు పార్టీల మధ్య పొత్తు ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా రజినీకాంత్ ఇప్పట్లో సినిమాల నుండి రిటైర్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే సినిమాలో ఆయన నటిస్తున్నారు. మరో సినిమా కూడా ఒప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజకీయాలలోకి వద్దాం అనుకునే సినీ నటులు పూర్తిగా అటువైపే దృష్టి పెడితేనే ప్రజలు వారిని సీరియస్ గా తీసుకుంటారని గత అనుభవాలు చెబుతున్నాయి. మరి రజినీ విషయంలో ఏం జరగబోతుందో?