Rajinikanth- BJPసూపర్ స్టార్ రజినీకాంత్ బీజేపీకి దగ్గరగా జరుగుతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. రజిని దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యలేదు. మొత్తానికి దానిపై ఆయన పెదవి విప్పారు. ప్రముఖ తమిళ కవి,తత్వవేత్త తిరువళ్లువర్‌కు కాషాయ రంగు పులిమినట్టుగా.. తనకూ కాషాయ రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని రజనీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

తనను బీజేపీలోకి లాగేందుకు ప్రయత్నాలు జరిగాయని.. అయితే తిరువళ్లువర్‌ లాగే తానూ కాషాయానికి చిక్కే వ్యక్తిని కాదని వ్యాఖ్యానించారు. తాను బీజేపీకి అనుకూలం కాదని.. తన భావజాలం వేరే అని స్పష్టం చేశారు. చాలా కాలంగా దక్షిణాదిలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. తమిళనాడులో రజనీకాంత్ ద్వారా రాజకీయాలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు దీనితో బెడిసికొట్టాయి అని అనుకోవచ్చు.

ఇది ఇలా ఉండగా దాదాపుగా రెండు ఏళ్ళ క్రితం రాజకీయాలలోకి వస్తా అని ప్రకటించిన రజినీకాంత్ ఇప్పటివరకు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చెయ్యలేదు. ఆ తరువాత జరిగిన ఎన్నికలలో కూడా పోటీ చెయ్యలేదు. మరోవైపు పార్టీ పెట్టిన మరో నటుడు కమల్ హాసన్ ఇప్పటికే ఎన్నికలలో పోటీ చేసి భంగపడ్డారు కూడా.

అయితే 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రజిని పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. కానీ దానికి సంబందించిన పని ఇప్పటి నుండే మొదలు పెట్టకపోతే మాత్రం కమల్ లాగే భంగపాటు తప్పదు. ఇది ఇలా ఉండగా రజినీకాంత్ దర్బార్ సినిమా సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉంది. మరో సినిమా కూడా తొందరలోనే సెట్స్ మీదకు వెళ్తుంది.