Rajinikanth Steps Back for a Whileసూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశం గురించి నిర్ణయం తీసుకోవడానికి 24 సంవత్సరాలు పట్టింది. ఈ నటుడు 1996 లో రాజకీయాలపై తనకున్న ఆసక్తి గురించి మొదట సూచించాడు. ఆ తరువాత చాలా సార్లు వస్తా అని రానని చెబుతూ వచ్చి మొత్తంగా ఈరోజున రాజకీయ ప్రవేశం గురించి తన తుది నిర్ణయాన్ని ప్రకటించాడు.

రజనీకాంత్ జనవరి 2021 లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. దానికి సంబంధించిన కీలక ప్రకటన డిసెంబర్ 31 న జరుగుతుంది. “మేము ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధిస్తాము మరియు నిజాయితీ, పారదర్శక, అవినీతి రహిత ఆధ్యాత్మిక రాజకీయాలను ఇస్తాము. ఒక అద్భుతం ఖచ్చితంగా జరగబోతుంది,” అని ప్రకటించారు.

దీంతో తమకు అదిరిపోయే న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చారంటూ తలైవా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండటంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఆయనను అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. 2021 వేసవిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

అంటే రజనీకాంత్ ఎన్నికలకు 4-5 నెలల ముందు తన పార్టీని ఏర్పాటు చేస్తారు. సూపర్ స్టార్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో పర్యటించడానికి కూడా సమయం ఉండకపోవచ్చు. అంతేకాక, ఆయనకు పెండింగ్లో ఉన్న చిత్రం కూడా ఉంది. రజనీకాంత్ పార్టీ అన్ని సీట్ల నుంచి పోటీ చేయకపోవచ్చు, బిజెపితో పొత్తు పెట్టుకోవచ్చని పుకార్లు ఉన్నాయి.

డిసెంబర్ 31న దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరో సూపర్ స్టార్ కమల్ హసన్ కూడా తన మక్కల్ నీది మయం పార్టీతో రాజకీయాలలో ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించనున్న విషయం మన పాఠకులకు తెలుసు. అయితే ఆయన పార్టీ నిరుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది.