Rajinikanth-Pettaసూపర్ స్టార్ రజినీకాంత్… బహుశా ఆయనకు ఉన్న అభిమాన దళం దేశంలోనే ఎవరికీ ఉండకపోవచ్చు. ఆయనకు కొద్ది కాలంగా సినిమాలలో సరైన విజయాలు లేవు. ఈ మధ్య కాలంలో సినిమాలలో విజయాలు తగ్గిన బడా హీరోలు వెంటనే రాజకీయాలలోకి వచ్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రజిని మీద కూడా అవే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. సినిమాల ద్వారా రంజింప చెయ్యకపోయినా రాజకీయాలలో తమ సత్తా చూపిస్తారని భావించారు. అయితే రజినీ పూర్తిగా నిరాశపరిచారు.

సినిమాలు చేసుకుంటూ పోవడం… విజయాలు లేవు… రాజకీయరంగేట్రం అని ప్రకటించి కనీసం పార్టీ పేరు కూడా ప్రకటించకపోవడం… పార్టీని పూర్తిగా గాలికి వదిలెయ్యడం… ఇలా ఏ విధంగానూ అభిమానులను సంతృప్తి పరచలేదు. ఇప్పుడు తాజాగా త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని, తాను ఏ పార్టీకి మద్దతు కూడా తెలపనని వెల్లడిస్తూ తాజాగా ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు.

తన అభిమాన సంఘాలు కానీ, ఇతర పార్టీ వర్గాలు కానీ ప్రచారం కోసం తన పేరును వాడుకోవద్దని హెచ్చరించారు. దీనితో అభిమానులు పూర్తిగా నిరాశ పడిపోయారు. ఈ మాత్రం దానికి రాజకీయం ఎందుకు? పార్టీ ఎందుకు అని మదనపడుతున్నారు. రజినీ కంటే వెనుక పార్టీ పెట్టిన కమల్ హస్సన్ ఇప్పటికే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తున్నాం అని ప్రకటించేశారు. కనీసం ఆ పాటి ఎఫర్ట్ కూడా రజినీకాంత్ పెట్టకపోవడం అభిమానులను నిరాశపరుస్తుంది. రజినీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కూడా ఆయన పార్టీని ప్రజలు సీరియస్ గా తీసుకోరని అభిమానులు భయపడుతున్నారు.