rumటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడదుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మరియు నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి పలుసార్లు చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. దాంతో ఏప్రిల్‌లో ఇప్పటికే ఇతర చిన్న సినిమాలు సైడ్ అయ్యాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌బాబుకు కోలీవుడ్ సూపర్ స్టార్ గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న ‘కబలి’ చిత్రాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 4న తమిళుల కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి.
మొదట ‘కబలి’ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జనవరిలో సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కాని కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది. దాంతో సినిమాను వాయిదా వేసి ఏప్రిల్‌లో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తమిళ సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘కబలి’ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించిన తర్వాత కాని ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు లేవు. ఒక వేళ ఏప్రిల్ నెలలోనే ‘కబలి’ చిత్రం విడుదల అయితే మహేష్‌బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రం విడుదల తేదీలో మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇద్దరు సూపర్ స్టార్‌లు ఏప్రిల్ నెలలో తలబడుతారేమో చూడాలి.