rajinikanth-politics150 సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి నుండి ఓ పది, పదిహేను సినిమాలు చేసిన సినీ జనాలకు అంతిమంగా కనపడుతోంది రాజకీయ రంగమే అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు చాలా అరుదుగా రాజకీయాల్లోకి వచ్చే సినీ ఇండస్ట్రీకి చెందిన వారు, ప్రస్తుతం కోకోల్లల్లుగా వచ్చిచేరుతున్నారు. అయితే ఇండియానే కాదు, జపాన్, చైనాలను కూడా ఊపేసే సత్తా ఉన్న ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ రాజకీయ తెరంగ్రేటం గురించి ఎన్నో సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది.

తమిళనాట ప్రతి ఎన్నికలు జరిగిన సందర్భంలో సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ వార్తలు ప్రధానంగా ప్రచురితమవుతూ ఉంటాయి. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంలో కూడా రజనీ రాజకీయ రంగం ఎంట్రీ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడింది. రజనీ సోదరుడు సత్యనారాయణ చేసిన ఈ ప్రకటన, అభిమానుల్లో ఇప్పటివరకు ఉన్న సందేహాలను నివృత్తి చేసింది.

“రజనీకాంత్ ఎప్పటికీ రాజకీయాల్లోకి రాబోరని, కేవలం చిత్ర పరిశ్రమకు మాత్రమే అంకితమవుతారని” ఒక స్పష్టమైన ప్రకటన చేసారు సోదరుడు సత్యనారాయణ. కుటుంబ సభ్యులతో కలిసి రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన సత్యనారాయణ ఈ విషయాన్ని స్పష్టం చేసారు. అంతేకాదు, ఈ నిర్ణయం ఇప్పటిది కాదని, రజనీ ఎప్పుడో తీసుకున్న నిర్ణయమని తేల్చిచెప్పారు.