Raja The Great Movieమాస్ మహారాజా హీరోగా తెరకెక్కిన “రాజా ది గ్రేట్” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ప్రభావంతోనే యూ ట్యూబ్ లో 1 మిలియన్ క్లిక్స్ ను దాటి 2 మిలియన్ దిశగా పరుగులు పెడుతోన్న ఈ సినిమాపై చిత్ర యూనిట్ పూర్తి నమ్మకంతో ఉన్నట్లుగా కనపడుతోంది. సాధారణంగా తెలుగునాట దీపావళి పండగ నాడు సినిమాలను విడుదల చేయరని, అమావాస్య రోజు కావడంతో తెలుగు వారికి ఇది నప్పక రిలీజ్ చేయరని, కానీ ఆ సెంటిమెంట్ ను “రాజా ది గ్రేట్” బ్రేక్ చేస్తుందని నిర్మాత దిల్ రాజు పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు.

దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని, గ్లామర్ తో పాటు అభినయం ప్రదర్శించే పాత్రలో నటించిన హీరోయిన్ మెహ్రీన్ అంకిత భావం చాలా ఆశ్చర్యం కలిగించిందని, తెలుగు నాట జెండా పాతేయడం ఖాయమని హీరో రవితేజ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఇక నటకిరీటీ రాజేంద్రప్రసాద్ అయితే, ఇండస్ట్రీలో 40 ఏళ్ళుగా తానూ ఉన్నానని, అనేక సినిమాలు చూసాను గానీ, ఇలాంటి సినిమా తెలుగులోనే కాదు, ఇప్పటివరకు ఏ భాషలోనూ రాలేదని “రాజా ది గ్రేట్”ను ఆకాశానికెత్తేశారు.

సినిమాను దర్శకుడు ఎలా తెరకెక్కించారో అన్న విషయం తెలియాలంటే 19వ తేదీ వరకు వేచిచూడాలి గానీ, విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ అయితే రాజేంద్రప్రసాద్ చెప్పినంత ఫీలింగ్ ను కలిగించలేదన్నది స్పష్టం. మరి అనిల్ అంత అద్భుతంగా ఎలా తీసారో గానీ, నిర్మాత దిల్ రాజు కూడా అమావాస్య సెంటిమెంట్ ను బ్రేక్ చేసి మరీ, ఈ సినిమా విజయవంతం అవుతుందని చెప్పారు. సో… మాస్ మహారాజా ఫ్యాన్స్ కు ‘ఫెస్టివల్’ టైం స్టార్ అయినట్లేనా..! అలాగే ఈ సినిమాతో అనిల్ రావిపూడి పేరు మరోసారి మోతమోగడం ఖాయమేనా!