Rajdoot Movie Release dateదివంగత నటుడు, రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి తనయుడు మేఘాంశ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘రాజ్‌దూత్’. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్తి బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. మొన్న ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై నిరాశాజనకమైన రెస్పాన్స్ పొందింది. మేఘాంశ్ ఇంకా పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

వచ్చే నెల ఐదున విడుదల చెయ్యబోతున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అంటే సమంత ఓ బేబీ చిత్రంతో బాక్స్ ఆఫీసు వద్ద పోటీ పడబోతోంది. అసలే ఆడియన్స్ లో పెద్దగా హైప్ లేని ఈ సినిమా సమంత సినిమాతో పోటీ పెట్టడం అంటే సాహసం అనే అనుకోవాలి. ఒకవైపు ఓ బేబీ ప్రచారంలో దూసుకుపోతుంటే రాజ్‌దూత్ ఆ విషయంలో చాలా వెనుకబడి ఉంది. ఇది ఇలా ఉండగా శ్రీహరి కుటుంబం మేఘాంశ్ మొదటి సినిమా సందర్భంగా ఇండస్ట్రీలోని పెద్దలు, స్టార్ హీరోలు తమకు మద్దతుగా రావాలని కోరుకుంటున్నారు.

టైటిల్‌కి తగ్గట్టే.. రాజ్ దూత్ బైక్ చుట్టూ ఈ కథను అల్లినట్టు సమాచారం. ఈ సినిమాలో వాడిన బైకుకు కమెడియన్ సునీల్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. మేఘాంశ్ పక్కన ప్రియాంక వర్మ అనే కొత్త హీరోయిన్ నటిస్తుంది. మేఘాంశ్ గతంలో శ్రీహరి నటించిన ‘భైరవ’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. యాక్టింగ్ లో శిక్షణ తీసుకుని తెలుగు చలనచిత్ర రంగంలోకి అడుగుపెడుతున్న మేఘాంశ్ తండ్రి పేరు ఏ మాత్రం నిలబెడతాడో చూడాల్సి ఉంది.