Rajasthan-Royals-win-by-30-runs,-knock-RCB-outఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 11 నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు వైదొలిగింది. కీలకమైన చివరి పోరులో గెలిచి ప్లే ఆఫ్స్ కు అర్హత సంపాదించాలని భావించిన బెంగుళూరు జట్టు ఆశలు ఆవిరి అయ్యాయి. రాజస్తాన్ రాయల్స్ తలపడిన ‘కోహ్లి అండ్ కో’ కేవలం 164 పరుగులు చేధించలేక 134పరుగులకే చతికిలపడింది. దీంతో 12 పాయింట్లతో సరిపెట్టుకున్న విరాట్ సేన టోర్నీ నుండి అవుట్ అయ్యింది.

మరోవైపు ఈ విజయంతో 14 పాయింట్లు తెచ్చుకున్న రాజస్తాన్ జట్టు, ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే ఆదివారం నాడు జరిగే ముంబై ఇండియన్స్ – ఢిల్లీ డేర్ డెవిల్స్ మరియు పంజాబ్ – చెన్నై జట్ల మధ్య జరిగే మ్యాచ్ ల పై ఆధారపడి ఉంది. రేపటి మ్యాచ్ లో ముంబై గెలిస్తే రన్ రేట్ ఆధారంగా రాజస్తాన్ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. అదే ముంబై ఓటమి పాలయితే, మరలా రాత్రి వేళలో జరగబోయే పంజాబ్ – చెన్నై జట్ల మ్యాచ్ కీలకంగా మారుతుంది.

ఆ మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధిస్తే నెట్ రన్ రేట్ చాలా కీలక పాత్ర పోషించనుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుపై గెలిచినా, రాజస్తాన్ రాయల్స్ జట్టు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆర్సీబీ అభిమానులు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ మ్యాచ్ లో విజయం సాధించే అవకాశం ఆర్సీబీకి పుష్కలంగా ఉంది.

165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జట్టు తొలి 8 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి 74 పరుగులు చేసి లక్ష్యం దిశగా అడుగులు వేసింది. కానీ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ ను వరుసగా పెవిలియన్ కు పంపి కోలుకొని దెబ్బ తీసాడు. కీలకమైన తరుణంలో 35 బంతుల్లో 53 పరుగులు చేసిన డివిలియర్స్ కూడా పెవిలియన్ కు చేరుకోవడంతో బెంగుళూరు పరాజయం ఖరారైంది.