Prabhas - Rajamoouli“బాహుబలి” రెండు సినిమాలతో దేశవ్యాప్తంగా ఎస్.ఎస్.రాజమౌళి మరియు ప్రభాస్ లు పాపులర్ అయ్యారు. ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ ‘సాహో, రాధే శ్యామ్’ సినిమాలు రిలీజ్ కాగా, ఆ రెండూ నిరాశాజనమైన ఫలితాలను చవిచూశాయి. దీంతో ‘బాహుబలి’ క్రెడిట్ అంతా రాజమౌళిదేనని, జక్కన్న వలనే ప్రభాస్ కు అంత క్రేజ్ వచ్చిందని సోషల్ మీడియాలో చర్చ జరిగింది.

తాజాగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కావడం.., పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో మరోసారి రాజమౌళి Vs ప్రభాస్ క్రేజ్ తెరపైకి వచ్చింది. ప్రభాస్ ప్లాప్ సినిమా టాక్ తో “సాహో” ద్వారా తొలిరోజు హిందీలో 24 కోట్లు కొల్లగొడితే, రాజమౌళి హిట్ రివ్యూస్ తో “ఆర్ఆర్ఆర్” ద్వారా బాలీవుడ్ లో 19 కోట్లు మాత్రమే సాధించారని ప్రభాస్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.

నేషనల్ హీరోగా అవతరించిన ప్రభాస్ ది లాటరీ కాదు, తన సొంత టాలెంట్ వలనే ప్రభాస్ ఈ స్థాయికి ఎదిగారని ప్రత్యర్థి అభిమానులకు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. కలెక్షన్స్ అంశాన్ని చూపిస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తోన్న వాదనలో కొంత అర్ధమున్నా, ఇలాంటి అర్థరహిత చర్చలకు దారితీయడం సబబు కాదేమో!

నిజంగా రాజమౌళితో పోల్చాలనుకుంటే, ‘సాహో’ కలెక్షన్స్ తో పాటు లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘రాధే శ్యామ్’ కలెక్షన్స్ గురించి కూడా చర్చించాల్సి ఉంటుంది. ‘బాహుబలి’ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ తో ‘సాహో’కు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ ఓపెనింగ్స్ తో ‘రాధే శ్యామ్’ ఓపెనింగ్స్ కు ఎక్కడా సంబంధం లేదన్న విషయం బహిరంగమే.

ఇక ‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వస్తే… బాలీవుడ్ లో తొలిరోజు 19 కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ‘సాహో’ సినిమాతో తక్కువే అయినా, ఇప్పటికి పలు మార్లు వాయిదాలు పడడం బాలీవుడ్ నాట ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ తగ్గిందనడానికి నిదర్శనం. నిజానికి ఈ మాత్రం కూడా వస్తాయని ముందుగా అనుకోలేదు. కానీ పాజిటివ్ రివ్యూస్ రావడంతో ఈవెనింగ్ అండ్ నైట్ షోస్ ప్రేక్షకులతో కళకళలాడాయి.

మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్షన్స్ రెండు, మూడు రోజుల్లో రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓపెనింగ్ డే ఎలా ఉన్నా… ఓవరాల్ గా ‘సాహో’ కలెక్షన్స్ ను ‘ఆర్ఆర్ఆర్’ అధిగమిస్తుందన్న నమ్మకమైతే ఏర్పడింది. అయితే ఇది ‘బాహుబలి 2’ వరకు రీచ్ అవుతుందా? లేదా? అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేని విషయం.

ఏ సినిమా కలెక్షన్స్ అయినా, క్రేజ్ అయినా ఏ ఒక్క వ్యక్తి మీద ఆధారపడి ఉండదని ప్రభాస్ ఫ్యాన్సే కాదు, ఇతర సినీ హీరోల అభిమానులు కూడా గుర్తించాలి. 24 క్రాఫ్ట్స్ కలిసి పనిచేస్తేనే మనం సిల్వర్ స్క్రీన్ మీద చూడగలుగుతుంటాం. దానికి ఒక వ్యక్తిని బాధ్యుడ్ని చేయడం అనేది అవగాహనా రాహిత్యం తప్ప, మరొకటి కాదు.

‘సక్సెస్’ మాత్రమే కొలమానంగా భావించే సినీ ఇండస్ట్రీకి వచ్చేపాటికి, హీరోల కంటే ముందుగా రాజమౌళి పేరునే ప్రస్తావించాల్సి ఉంటుంది. అపజయం అంటూ ఎరుగని దర్శకుడిగా రాజమౌళి పేరు, అందరి హీరోల కంటే ముందు వరుసలోనే ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఆ స్థాయికి అర్హుడు కూడా మన జక్కన్న! టాలీవుడ్ నుండి ఆ స్థాయికి వెళ్లినందుకు మనందరం కూడా గర్వపడాలి గానీ, అర్ధరహితపు వాదనలు వినిపించడం వ్యర్థం.