“ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ ఆసక్తికర అంశాన్ని దర్శకదిగ్గజం రాజమౌళి లేవనెత్తారు. ఈ సినిమాకు పని చేసిన వారికి, అలాగే అక్కడికి విచ్చేసిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపిన రాజమౌళి, ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఉదంతాన్ని కూడా స్పృశించారు.
“ఆయన్ని గురించి చాలా మంది చాలా మాటలు అన్నారు, రకరకాల మాటలు అన్నారు. మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారు, చిరంజీవి గారు మీరు నిజమైన మెగాస్టార్” అంటూ ఎంతో ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు రాజమౌళి.
ఏపీలో కొత్త జీవో వచ్చినపుడు వ్యక్తిగతంగా తనతో పాటు ఇండస్ట్రీ అంతా ప్రయత్నించిందని, ఎవ్వరమూ కూడా ముందుకు వెళ్లలేకపోయాం. కానీ ఒక వ్యక్తి వచ్చి, ముఖ్యమంత్రితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, రెండు, మూడు సార్లు వెళ్లి కలిసి, మొత్తమంతా వివరించి, కొత్త జీవో ద్వారా రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు నాటి తాడేపల్లి ఉదంతాన్ని మళ్ళీ ప్రేక్షకుల కళ్ళ ముందుంచింది.
ఇంకా చాలామందికి తెలియని విషయమేమిటంటే… తెలంగాణ ప్రభుత్వం నుండి జీవో రావడానికి కారణం కూడా మెగాస్టార్ చిరంజీవేనని రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన తెరవెనుక ఉండి, నడిపించి అంతా చేసారు. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం ఆయనకీ ఇష్టం ఉండదు, ఇండస్ట్రీ బిడ్డగానే భావిస్తారు, కానీ నా దృష్టిలో ఆయన “ఇండస్ట్రీ పెద్దే” అన్నారు జక్కన్న.
తెలుగు సినిమా పరిశ్రమ అంతా చిరంజీవి గారికి ఋణపడి ఉందంటూ జక్కన్న చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీకి చేసిన సాయాన్ని మరిచిపోకుండా, ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ పేరును ప్రస్తావించడం కూడా రాజమౌళి సంస్కారాన్ని సూచిస్తుంది, అలాగే మెగాస్టార్ తెరవెనుక ఇండస్ట్రీ కోసం ఎంతలా ప్రాకులాడారో కూడా అర్ధమవుతోంది.