SS-Karthikeya-Allu-Arjun-Pawan-Kalyanమెగా తనయురాలు నిహారిక తొలి మూవీ ‘ఒక మనసు’ ఆడియో వేడుక ద్వారా అల్లు అర్జున్ పలికిన ‘స్వరం’ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఇటీవల చేసిన ‘చెప్పను బ్రదర్’ అన్న పదం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయిన విషయం తెలిసిందే. అలాగే మరోసారి అలాంటి వ్యాఖ్యలనే దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిపీట్ చేసి, తన ‘టార్గెట్’ ఏమిటో స్పష్టంగా చెప్పాడు. అయితే ఉన్నట్లుండి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసారు? అన్న అంశం ఆసక్తికరంగా మారడంతో మళ్ళీ అల్లు అర్జున్ ఎప్పుడు స్పందిస్తారా అని సర్వత్రా ఎదురు చూసారు. దానికి ‘ఒక మనసు’ ఆడియో వేదిక అయ్యింది.

ఆడియో ఫంక్షన్ల వంటి బహిరంగ వేడుకలపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్నటువంటి రచ్చను నిలదీశాడు. మరో రకంగా చెప్పాలంటే… మీరు చేస్తున్నది తప్పు అంటూ ధైర్యంగా చెప్పారు. అది కూడా మన సినిమాల వరకు పరిమితం కాకుండా ఇతర హీరోల ఆడియో వేడుకలలో కూడా ‘పవర్ స్టార్… పవర్ స్టార్…’ అంటూ అరవడం తనకు నచ్చని విషయమని, తనకే కాదు చాలా మంది తన వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించారని, అది తనకు చిన్నతనంగా అనిపించి… ఇక దీనికి చరమగీతం పాడాలని నిర్ణయించుకుని ఈ విషయాలను తెలుపుతున్నానని సుదీర్ఘ ప్రసంగం చేసారు.

ఇదంతా ఒకెత్తు అయితే… అల్లు అర్జున్ ఇచ్చిన ప్రసంగంపై రాజమౌళి తనయుడు కార్తీకేయ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. “ఫైనల్లీ… ది వాయిస్ ఆఫ్ మెనీ…” అంటూ కార్తీకేయ చెప్పడం అంటే… అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు బన్నీ ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు, ఇండస్ట్రీలో చాలా మంది ఇలాంటి అభిప్రాయాలతోనే ఉన్నారని స్పష్టం చేస్తోంది. బహిరంగంగా వెల్లడిస్తే బహుశా అభిమానులు ఎలా స్వీకరిస్తారో తెలియక బయటపడి ఉండక పోవచ్చు గానీ, చాలా మందిలో ఇదే అభిప్రాయం ఉందని స్వయంగా రాజమౌళి తనయుడే చెప్పాడంటే… విషయం ఎక్కడి వరకు వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు.

ఇటీవల ప్రభాస్ పాల్గొన్న ఒక ఆడియో వేడుకలో కూడా పవన్ అభిమానులు చేసిన రచ్చ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బన్నీ చెప్పిన ఒక మాటను ప్రస్తావించాలి. అలా ‘మీరు’ గోల పెడుతున్నపుడు, ఏదో మెకానికల్ గా చెప్పాలి కాబట్టి… పవన్ కళ్యాణ్ ఇష్టమే అని చెప్తున్నారు అంటూ బన్నీ చేసిన మాటలు అక్షర సత్యం. అలాగే పరోక్షంగా త్రివిక్రమ్ గురించి కూడా బన్నీ ప్రస్తావించారు. చూడబోతుంటే… తెలుగు సినీ పరిశ్రమలోని చాలా మంది తరపున ఈ గురుతర బాధ్యతను తన తలపై వేసుకున్నట్లుగా కనపడుతోంది. ఒక రకంగా ఈ బాధ్యతను తీసుకున్నందుకు బన్నీని అభినందించి తీరాలి. అభిమానులతో పెట్టుకోవడం అంటే… చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఏదైనా కాస్త అటు ఇటు అయితే ఏకంగా కెరీర్ కే దెబ్బ పడేటంత డేంజరస్ విషయం. కానీ, దానిని సమయస్ఫూర్తితో చక్కగా హ్యాండిల్ చేసాడు బన్నీ.

నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెదవి విప్పి తన అభిమానులకు ఈ విషయం చెప్పినట్లయితే “విషయం” ఇక్కడి దాకా వచ్చేది కాదు. అయితే ఈ వివాదానికి ముగింపుగా బన్నీ చెప్పినట్లు… అంతా మర్చిపోదాం… ఇక నుండి ఎలాంటి అభ్యంతకరమైన ప్రవర్తనలు లేకుండా, అందరికీ గౌరవ మర్యాదలు ఇస్తూ సరిగా ప్రవర్తిస్తారని ఆశిద్దాం.