ట్రైలర్ టాక్ - అంచనాలకు ఆకాశమే హద్దు!ప్రేక్షకులతో పాటు సినీ ప్రపంచమంతా ఎదురుచూస్తోన్న “ఆర్ఆర్ఆర్” ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైంది. రిలీజ్ విషయంలో ఎలాంటి ట్విస్ట్ లకు తావు లేకుండా, ముందుగా సాయంత్రం 4 గంటలకు విడుదల అని చెప్పి, ఉదయం 11 గంటలకే అన్ని భాషలలో ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి అందరినీ ఖుషీ చేసింది చిత్ర యూనిట్.

మూడు నిముషాలకు పైగా నిడివి ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఒక విధంగా చెప్పాలంటే… జనవరి 7వ తేదీన సిల్వర్ స్క్రీన్ పై తాను మూడు గంటల పాటు ఏం చెప్పబోతున్నాను అనే విషయాన్ని ఈ మూడు నిముషాల ట్రైలర్ ద్వారా జక్కన్న చెప్పేసారు. స్టోరీ చెప్పి మరీ సక్సెస్ కొట్టడం ఒక్క రాజమౌళికే సాధ్యం అనిపించే విధంగా ట్రైలర్ ను కట్ చేసారు.

Also Read – సామాన్యులు కూడా రాజకీయాలకు బలి కావలసిందేనా?

గ్రాండ్ విజువల్స్… సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్… హాలీవుడ్ రేంజ్ కు మించిన యాక్షన్ సీన్స్… ఇలా టెక్నికల్ గా అత్యున్నత స్థాయిలో ఉన్న “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ లో జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు ఒకే షాట్ లో కనిపించిన దృశ్యాలు అభిమానులకు కన్నులవిందుగా మారాయి. సినిమా ఆద్యంతం ఇద్దరూ కలిసే ఉండబోతున్నారని ట్రైలర్ లోని ‘కంటెంట్’ చెప్పకనే చెప్పింది.

ఇక, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరియు రామ్ చరణ్ అభిమానులకు కలకాలం గుర్తుండిపోయే విధమైన షాట్స్ ఈ ట్రైలర్ లో ఉన్నాయి. ట్రైలర్ మొదట్లో వచ్చిన పులి షాట్, అలాగే చివర్లో వచ్చిన బుల్లెట్ షాట్… జూనియర్ ఫ్యాన్స్ ను ఊర్రూతలూగిస్తున్నాయి. ఇక చెర్రీకైతే అల్లూరి సీతారామరాజుగా మంటల్లో నుండి బాణం వేసిన షాట్ జీవితకాలానికే హైలైట్ అని చెప్పవచ్చు.

Also Read – జగన్‌ ఓడిపోతారంటారా… అయితే ఎల్లో ముద్ర వేసేయాల్సిందే!

అలాగే ఇద్దరు కలిసి ఉన్న షాట్స్ లలో… ఫ్లాగ్ పట్టుకుని బ్రిడ్జి క్రింద ఇద్దరు చేతులు కలిపే షాట్, ట్రైన్ కు అటు ఇటు ఇద్దరూ పరిగెడుతున్న షాట్… కుంభస్థలాన్ని కొడదామంటూ మంటల పైనుండి దూకే షాట్… హైలైట్స్ గా నిలిచాయి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత జనవరి 7వ తేదీ ఎప్పుడు వస్తుందా? అని నిరీక్షించడం ప్రతి సినీ అభిమాని వంతు!

నిజానికి ట్రైలర్ ముందు వరకు “ఆర్ఆర్ఆర్” ఉన్న అంచనాలు సాధారణం. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి పాటల వరకు అన్ని కూడా ఇద్దరు అగ్ర హీరోలు కలిసి చేసారు అన్న దృక్పధం తప్ప, ‘బాహుబలి’ మాదిరి భారీ అంచనాలు ఏర్పడలేదు. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కధ మొత్తం మారిపోయింది. ‘కంటెంట్’లో ఉన్న బలానికి ఇద్దరు హీరోలు తోడవ్వడంతో… సిల్వర్ స్క్రీన్ పై జక్కన్న దండయాత్ర ప్రారంభం అయినట్లే! అసాధారణ ఫలితాలకు “ఆస్కారం” లభించినట్లే!

Also Read – చంద్రబాబు ఇంత శక్తివంతుడా? థాంక్స్ వైసీపి!