Rajamouli -RRR- Ram Charan - Jr NTRసిల్వర్ స్క్రీన్ పై ‘సక్సెస్’ తప్ప ‘ఫెయిల్యూర్’ అంటే తెలియని రాజమౌళి “ఆర్ఆర్ఆర్” సినిమా ప్లానింగ్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారా? ఏ సినిమాకు ఎలాంటి పబ్లిసిటీ చేయాలి? ప్రేక్షకులను ఎలా ధియేటర్లకు రప్పించాలి? అని రాజమౌళికి తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదు. మరి అలాంటి జక్కన్న ప్లానింగ్ “ఆర్ఆర్ఆర్” విషయంలో ఎందుకు లోపిస్తుందో ప్రేక్షకులకు అర్ధం కావడం లేదు.

ముఖ్యంగా ఈ సినిమా ‘ఫస్ట్ లుక్’ నుండి లేటెస్ట్ ‘ధియేటిరికల్ ట్రైలర్’ వరకు అన్నీ కూడా వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. ఎంతో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత కలిగిన ‘బాహుబలి’ రెండు సినిమా పార్టులను కూడా చెప్పిన టైంకు చెప్పినట్టు తీసుకువచ్చిన జక్కన ఈ మల్టీస్టారర్ మూవీకి మాత్రం ‘వాయిదా’ అనేది ‘ఆనవాయితీ’గా మారింది.

2017లో ‘బాహుబలి 2’ రిలీజ్ అయిన నాటి నుండి ‘ఆర్ఆర్ఆర్’ మీదనే రాజమౌళి ఫోకస్ చేసారు. ఇద్దరు టాప్ హీరోలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా షూటింగ్ ముగించారు. కత్తి మీద సాము లాంటి ఈ అంశాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన రాజమౌళి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో మాత్రం తన మార్క్ ను ప్రదర్శించలేకపోతున్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా బ్రేకులు పడుతోన్న రాజమౌళి “ఆర్ఆర్ఆర్” సినిమాను కనీసం జనవరి 7వ తేదీన అయినా మిస్ కాకుండా తీసుకురమ్మని వేడుకోవడం సినీ ప్రేక్షకుల వంతవుతోంది. ముఖ్యంగా ఈ వాయిదాల పర్వాన్ని సహించలేని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో తమ నిరసన భావాలను వ్యక్తపరుస్తున్నారు. ట్రైలర్ లేటెస్ట్ రిలీజ్ డేట్ మాత్రం రెండవ వారంలో ఉండనుందని సమాచారం.