Rajamouli RRR movie press meetరాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ప్రధానపాత్రలలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా రాజమౌళి ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

“సినిమా తీసేటప్పుడు నా కధ, నా నటులు, వారి అభిమానులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని తీస్తుంటాను తప్ప విమర్శించేవారిని పట్టించుకోను. అలాగే నా చేతిలో లేని వాటి గురించి అంటే..కరోనా కేసులు, థియేటర్లు మూతపడటం వంటివాటి గురించి ఆ సమయంలో అస్సలు ఆలోచించను. కేవలం సినిమాను ఎంత గొప్పగా తీయాలని మాత్రమే ఆలోచిస్తాను,” అని చెప్పారు.

రాజమౌళికి టెన్షన్ ఎప్పుడూ ఉండదా… ఎప్పుడూ కూల్‌గా చిర్నవ్వుతో కనిపిస్తుంటారు? అనే ప్రశ్నకు సమాధానం చెపుతూ, “సినిమా పనులు జరుగుతున్నంతకాలం నేను వాటి గురించే ఆలోచిస్తుంటాను కనుక ఎటువంటి టెన్షన్ కూడా ఉండదు. కానీ సినిమా ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు వంటివన్నీ పూర్తయిపోయిన తరువాత ఇక చేయడానికి ఏ పని లేకుండా ఖాళీగా కూర్చొని సినిమా విడుదలకు ఎదురుచూస్తున్నప్పుడు అసలు టెన్షన్ మొదలవుతుంది. నేను ఊహించినట్లుగా సినిమాను తీయగలిగానా లేదా?నా సినిమాను ప్రేక్షకులు ఏవిదంగా రిసీవ్ చేసుకొంటారు?వారి స్పందన ఏవిదంగా ఉంటుంది?వంటి ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంది,” అని చెప్పారు.

జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ల గురించి మాట్లాడుతూ “జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ ఇద్దరూ పూర్తి భిన్నమైన శక్తిసామర్ధ్యాలు ఉన్న మంచి నటులు. ఇద్దరూ ఎవరికివారు గొప్ప నటులు. మేము ముగ్గురం మంచి స్నేహితులం. కనుక సినిమా షూటింగ్ చాలా హాయిగా సాగిపోయింది. వారిద్దరికీ నాపై ఎంత నమ్మకం అంటే నా సినిమాలో చేస్తారా?అని నేను అడగక్కరలేదు. నేను సినిమా గుర్తించి చెప్పగానే వారు కధేమిటి?దానిలో తమ పాత్రలను ఏవిదంగా చేయాలని మాత్రమే ఆలోచిస్తారు. అంత నమ్మకం వారికి నాపై.”

జూ.ఎన్టీఆర్‌ గురించి ఏమన్నారంటే, “జూ.ఎన్టీఆర్‌ చాలా తెలివైనవాడు. ఏవిదంగా చేస్తే పాత్ర రక్తి కడుతుందో ముందే ఊహించి చేస్తుంటాడు. అతను ఏవిదంగా చేస్తాడని నేను అనుకొంటానో సరిగ్గా అదేవిదంగా చేస్తుంటాడు. కనుక జూ.ఎన్టీఆర్‌ బుర్రలో ఏముందో…ఏమి చేయబోతున్నాడో నాకు ముందే తెలిసిపోతుంటుంది,” అని రాజమౌళి అన్నారు.

రామ్ చరణ్‌ గురించి చెపుతూ, “అతను ఏమి చేయబోతున్నాడో నేను కూడా ఊహించలేను. ఏరోజుకారోజు కొత్తగా చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటాడు. అయితే అతను ఓ తెల్లకాగితం వంటివాడు. నేను పెన్నులాంటివాడిని. నాకేమి కావాలో దానిపై వ్రాస్తే అదే సరిగ్గా కనిపిస్తుంది. చాలాసార్లు నేను ఊహించినదానికంటే చాలా గొప్పగా చేసి చూపించి అబ్బురపరుస్తుంటాడు,” అని రాజమౌళి చెప్పారు.