Rajamouli-RRR-Golden-Globe-Award-2023నవ్విన నాప చేనే పండకపోదని పెద్దలు ఊరికే అనలేదు. ఒకరు ఎదుగుతుంటే ఓర్వలేని తనం అన్ని చోట్ల ఉన్నట్టే ఇండస్ట్రీలోనూ పాతుకుపోయింది. దాన్ని వెళ్ళగక్కడానికి సవాలక్ష మార్గాలను ఎంచుకునే పెద్ద మనుషులు వందలు వేలు. ఎవరు ఔనన్నా కాదన్నా రాజమౌళి టాలీవుడ్ కే కాదు తెలుగు నేలకే గర్వకారణం. ఒకప్పుడు ఇండియన్ మూవీనా అని ఇంగ్లీష్ ఆడియన్స్ చులకనగా చూసే స్థాయి నుంచి వాళ్ళతోనే ఒళ్ళు మరిచి ఐమ్యాక్స్ స్క్రీన్ల ముందు డాన్స్ చేయించడం జక్కన్నకు మాత్రమే చెల్లింది. ఇంటర్నేషనల్ జర్నలిస్టులు ఆయన ఇంటర్వ్యూల కోసం పడిగాపులు కాస్తున్నారు. యుఎస్ ఏజెన్సీలు ప్రత్యేకంగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదంతా ఆర్ఆర్ఆర్ మహత్యమే. ఈ సినిమా రిలీజైనప్పుడు విరుచుకుపడిన క్రిటిక్స్ ఎందరో ఉన్నారు. స్వతంత్ర యోధుల పోరాటాన్ని వక్రీకరించారని ఒకరు, రొమాన్స్ కామెడీ లేకుండా చప్పగా తీశారని మరొకరు ఇలా రకరకాలుగా అర్థం లేని శల్యపరీక్ష చేసినవాళ్ళ లెక్కలేదు. రాజమౌళికి ఇవన్నీ తెలియక కాదు. అయినా మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోయారు. గోల్డెన్ గ్లొబ్ పురస్కారాల్లో నాటు నాటు పాటకు గాను కీరవాణికి అత్యంత గొప్ప గౌరవం దక్కింది. దానికి కారణం ఎవరు. విజయేంద్రప్రసాద్ ఇచ్చిన ఆలోచనలు కథను అంత గొప్పగా తెరకెక్కించి ఇలాంటి పాటలను రాబట్టుకున్న ఘనత ఎవరికి ఆపాదిస్తారంటే ఎవరైనా చెప్పే సమాధానం ఒకటేగా

బయటికి చెప్పినా చెప్పకపోయినా రాజమౌళి మీద ఏడ్చేవాళ్లకు కొదవలేదు. మన దగ్గరే కాదు బాలీవుడ్ లోనూ బొచ్చెడు మందున్నారు. బాహుబలి చూసే టైం లేదని చెప్పిన సల్మాన్ ఖాన్, దీని రిలీజ్ కు ముందు తానే కింగ్ మేకర్ నని ఫీలైన కరణ్ జోహార్, అసలు ఆ ప్రస్తావనే రాకుండా మాట్లాడే అమీర్ ఖాన్, సౌత్ గురించి ఏనాడూ పట్టించుకోని షారుఖ్ ఖాన్ వీళ్లంతా జయహో జక్కన్నా అంటున్నారంటే ఆ క్రెడిట్ ఆయన ఒక్కడికే కాదు. ఆ టీమ్ తో పాటు ఇలాంటి అద్భుతాలను ఆదరించే మన ఆడియన్స్ తో సహా అందరికీ దక్కుతుంది. అందుకే రాజమౌళి మీద ఇంత అక్కసు. ఇరవై సినిమాలు కూడా చేయని డైరెక్టర్ కి ఇంత ఆదరణా అనే ఈర్ష్య సహజం

ఇలాంటి శోకాల బ్యాచ్ వల్ల రాజమౌళికి వచ్చిన నష్టమేమీ లేదు. పైపెచ్చు ఆస్కార్ కి మరో మెట్టు దగ్గరైనందుకు గర్వపడుతున్నాడు. వచ్చే మార్చిలో అదీ వచ్చిందా ఎందరికి గుండె పోట్లు వస్తాయో చెప్పడం కష్టం. ఆర్ఆర్ఆర్ గురించి ఎవరెన్ని గింగుర్లు పోయినా ఇవాళ అది ఎవరూ అందుకోలేనంత ఎవరెస్టు ఎత్తులో నిలబడిపోయింది. దాన్ని తాకాలంటే మళ్ళీ అది తన వల్లే అవుతుంది తప్ప ఇంకొకరిని ఊహించుకోవడం కష్టమే. కెజిఎఫ్ డైలాగునే జక్కన్న స్టైల్ లో చెప్పాలంటే నేను స్టార్లతో సినిమాలు తీయలేదు నేను తీసిన సినిమాల్లో నటించినవాళ్లు స్టార్లు అవుతారు. అక్షరాలా ఇది రాజమౌళికి సరిపోతుంది. కమెడియన్ సునీల్ అయినా గ్రాఫిక్స్ లో సృష్టించిన ఈగ అయినా కోట్లాది ఫ్యాన్స్ ఉన్న ప్రభాస్ చరణ్ తారక్ లైనా జక్కన్న చేతిలో పడితే సానబడే వజ్రాలే.