Final-Hopes-on-Rajamouli-RRR“బాహుబలి” సినిమా రెండు భాగాలతో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి ఆర్జించిన కీర్తి అనన్య సామాన్యం. అంతటి విజయాన్ని చవిచూసిన జక్కన్న తదుపరి చిత్రంపై భారీ అంచనాలు ఉండడం సహజమే… దానికి ఏ మాత్రం తక్కువ కాకుండా ఏకంగా ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’లతో “ఆర్ఆర్ఆర్” రూపంలో మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించారు. జనవరి 7వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.

అందులో భాగంగా విడుదల చేసిన టీజర్ వీక్షకులలో అంచనాలను భారీగా పెంచగా, తాజాగా విడుదల చేసిన ‘నాటు నాటు’ లిరికల్ సాంగ్ మ్యూజికల్ గా నిరుత్సాహపరిచింది. నిజానికి మొదట విడుదల చేసిన ‘దోస్తీ’ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన విషయం తెలిసిందే. ఈ రెండు పాటలు “ఆర్ఆర్ఆర్”పై ఉన్న అంచనాలను తగ్గించాయని చెప్పలేం గానీ, “ఆర్ఆర్ఆర్”కు ఉన్న క్రేజ్ ను రెట్టింపు చేయడంలో దోహదపడలేదన్నది నిర్వివాదం.

అంచనాలు ఎంతగా పెరిగితే అంత స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయనేది ‘బాహుబలి’ ద్వారా జక్కన్న నిరూపించిన విషయం. మరి అదే దోవలో “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ మెటీరియల్ ఉందా? అంటే… ఆ బాధ్యత అంతా “ఆర్ఆర్ఆర్” ధియేటిరికల్ ట్రైలర్ పై పడింది. మల్టీస్టారర్ + దేశ భక్తి కధాంశం… వీటన్నింటికి మించి రాజమౌళి బ్రాండింగ్ తో జాతీయ స్థాయిలో క్రేజ్ గా మారిన “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ ను జక్కన్న అంత సాధారణంగా కట్ చేయరు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో… ట్రైలర్ రిలీజ్ తర్వాత “ఆర్ఆర్ఆర్” అసలు సౌండింగ్ తెలియనుంది.