Rajamouli on his next movie‘దర్శకధీరుడు’ రాజమౌళి తెరకెక్కించిన “బాహుబలి 2” విడుదలైన తర్వాత “మహాభారతం” ఎంతగా హాట్ టాపిక్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇప్పట్లో తీయలేను గానీ, ఓ పదేళ్ళ తర్వాత అయితే చేయగలుగుతానేమో అని రాజమౌళి స్పష్టంగా చెప్పిన దరిమిలా… పదేళ్ళ తర్వాత అంటే అప్పటికి ‘రాజేవరో.., రెడ్డవరో…’ అన్న చందంగా మారి, అప్పటికి ‘మహాభారతం’ ఉంటుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే రాజమౌళి దర్శకత్వంలో “మహాభారతం” ఖచ్చితంగా ఉండి తీరుతుందని చెప్తున్నారు జక్కన్న తండ్రి విజయేంద్రప్రసాద్.

మరి అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు అంటే… దానికి ఒక లాజిక్ ను కూడా వాడారు. యుద్ధాలు అంటే రాజమౌళికి చాలా ఇష్టమని, వాటి కోసమైనా ఖచ్చితంగా “మహాభారతం” తీస్తారని విజయేంద్రప్రసాద్ భోరసా ఇచ్చారు. గతంలో అయితే ‘మహాభారతం’ తీయగలుగుతాడా? లేదా? అన్న సందేహంలో ఉన్నాను కాబట్టి, ఎప్పుడు ఈ విషయాన్ని చెప్పలేదని, ‘బాహుబలి 2’ తర్వాత తీస్తాడన్న నమ్మకం కలిగి ఇప్పుడు చెప్తున్నానని అన్నారు. తను దర్శకత్వం వహించిన “శ్రీవల్లి” విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సదరు సంగతులను ప్రస్తావించారు.

ఇక ‘శ్రీవల్లి’ కధ విషయం చెప్తూ… తనకు వైజాగ్ లో రమేష్ అనే మిత్రుడు ఉండేవాడనీ, 2010లో వినాయకచవితి ముందురోజు ఆ మిత్రుడిని చూడాలని తనకి ఎంతగానో అనిపించిందని, మనసు ఆయన వైపే లాగిందని, కానీ అప్పుడు వెళ్లలేకపోయిన తాను, ఆ తరువాత రెండేళ్లకు వైజాగ్ లో ఆయన ఇంటికి వెళ్లానని అన్నారు. అయితే తన మిత్రుడు 2010లో వినాయక చవితి ముందు రోజు చనిపోయాడనీ, చివరి క్షణాల్లో తనని ఎంతగానో తలచుకున్నాడని ఆ కుటుంబ సభ్యులు చెప్పారని అన్నారు. తనని తన మిత్రుడు తలచుకున్నప్పుడే… తన మనసు ఆయన వైపుకు ఎందుకు లాగింది? అనే ఆలోచనలో నుండి, ఆ బాధలో నుంచి ఈ కథ పుట్టిందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.