Rajamouli on Baahubali 2 Review Critics (2)భారీ అంచనాలు నెలకొన్న “బాహుబలి 2” సినిమా మరో అయిదు రోజుల్లో ఫస్ట్ ప్రీమియర్ పడబోతోంది. బొమ్మ పడిన వెంటనే అందరి చూపులు ఈ సినిమా ‘రివ్యూ’లపై పడడం సహజం. ఇటీవల కాలంలో సినిమాలపై రివ్యూల ప్రభావం ఎక్కువవుతున్న నేపధ్యంలో ‘బాహుబలి 2’కు ఎలాంటి రివ్యూలు వస్తాయో చూడాల్సి ఉంది. అయితే అసలు ‘రివ్యూ’ల విషయంలో రాజమౌళి ఏమనుకుంటున్నారు? అంటే… తాజా ఇంటర్వ్యూలో రివ్యూలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు.

“రివ్యూ అనేది ఒక మనిషికి సంబంధించిన అభిప్రాయమని, రివ్యూలో ఎవరి అభిప్రాయం వారు వ్యక్తం చేస్తారని” ఒక్క మాటలో తేల్చేసారు. నిజానికి అలాంటి రివ్యూలను తాను పట్టించుకోనని స్పష్టం చేసిన రాజమౌళి, ఈ మధ్య కాలంలో వచ్చే రివ్యూలను ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటున్నారని, అలాగే తన అభిప్రాయం తనదని అన్నారు. రివ్యూలు తనకు అనుకూలంగా రాసేవారంతా మంచివాళ్లు అని, వ్యతిరేకంగా రాసేవారంతా తనకు వ్యతిరేకులని చమత్కరిస్తూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

తన సినిమాలకు మొదటి నుంచి వ్యతిరేకంగా రివ్యూ రాసేవారున్నారని… అలాగే పొడుగుతూ రివ్యూ రాసేవారున్నారని, ఎవరు ఎలా రాసినా మనం సినిమాను ఎలా తీశామన్నదే ముఖ్యమని అన్నారు జక్కన్న. ఇక, తన డ్రీమ్ ప్రాజెక్ట్ “మహాభారతం” సినిమా గురించి చెప్తూ… ఈ సినిమా తీయడానికి మరో పదేళ్ల అనుభవం తనకు అవసరమని, ఇటీవల ఎవరో యూఏఈ వ్యాపారి ‘మహాభారతం’ తీస్తారని వార్తల్లో వచ్చిందని, ‘మహాభారతం’ అనేది మహాసముద్రంలాంటిదని… అందులో చెంబుడు ఆయన తీసుకుంటున్నారని, అలాగే మరో చెంబుడు నేను తీసుకుంటానని, ఇలా ఎవరికి కావాల్సినంత వారికి మహాభారతంలో ఉంటుందని స్పష్టం చేసారు.