ms-dhoni-rajamouliదర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకు అనేక సినిమాల ఆడియో వేడుకలకు హాజరయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న మహేష్, పవన్ ల సినిమాల నుండి వర్ధమాన నటుల వరకు ఆడియో వేదికలపై సందడి చేసి, తనదైన రీతిలో సినిమాల గురించి, హీరోల గురించి వ్యాఖ్యానించేవారు. ఎప్పుడు ప్రసంగించినా తన పరిధులను దాటి మాత్రం ఎప్పుడూ రాజమౌళిని చూసి ఉండం. కానీ, తొలిసారిగా ఆ అవకాశం ‘ఎంఎస్ ధోని – ది అన్ టోల్డ్ స్టోరీ’ సినిమా ఆడియో వేదికపై తారసపడింది.

మైక్ అందుకున్న రాజమౌళి… ‘ధోనీ… ధోనీ…’ అంటూ ఒక సగటు అభిమాని మాదిరి అరవడం ఇండస్ట్రీ వర్గాలనే షాక్ కు గురిచేసింది. ధోనీ స్లోగన్స్ తో ఆడిటోరియం అంతా మారుమ్రోగగా… ధోని గురించి తనదైన రీతిలో ఎంతో ఉద్వేగభరితంగా ప్రసంగించారు జక్కన్న. అంతేకాదు, ధోనిని ఒక కర్మయోగిగా పేర్కొన్న రాజమౌళి… 2011లో ప్రపంచకప్ అందుకున్న తర్వాత సచిన్ తో సహా అందరూ భావోద్వేగాలను అణుచుకోలేకపోయారని, కానీ ధోని మాత్రం కప్ ను తన సహచరులకు అందించి, పక్కన నిల్చున్నారని, ఇంతకన్నా కర్మయోగిని మనం చూస్తామా? అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.

ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట కోసం తానూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, ధోని జీవిత చరిత్రను సినిమా రూపంలో నీరజ్ పాండే గారు అందిస్తున్నారని, గవాస్కర్, కపిల్ దేవ్ లు ఆడుతున్న సమయంలో మ్యాచ్ ను గెలుస్తామా? ఓడుతామా? అనే భయం ఉండేదని, కానీ ధోని కెప్టెన్ అయిన తర్వాత ఆ బెంగ లేకుండా పోయిందని, అలాంటి విజయపు అనుభూతులను పంచారని ధోని గురించి ఏకధాటిగా ప్రసంగించారు రాజమౌళి.