Rajamouli likes Bijjaladeva Characterసహజంగా తెలుగు సినిమాలలో హీరో పాత్రకే ప్రాధాన్యం ఉంటుంది. ఏం చేసినా హీరోనే చేయాలి అనే విధంగా పాత్రల డిజైన్ ఉంటుంది. ఇందుకు ఆ దర్శకుడు, ఈ దర్శకుడు అన్న తేడా లేదు. కానీ చాలాకాలం తర్వాత “బాహుబలి 2” సినిమాలో అన్ని పాత్రలు పండాయి. ఏ ఒక్క క్యారెక్టర్ ను తక్కువ చేయడానికి లేని విధంగా అన్ని క్యారెక్టర్లు అద్భుతమైన అభినయాన్ని పోషించారు. అయితే ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కో క్యారెక్టర్ అగ్ర స్థానంలో నిలుస్తోంది.

విమర్శకుల జాబితాలో మొదటి స్థానం ‘శివగామి’ పాత్రను పోషించిన రమ్యకృష్ణకు దక్కగా, ఆ తర్వాత ‘కట్టప్ప’ పాత్ర పోషించిన సత్యరాజ్ కు దక్కుతోంది. ఇక ‘యంగ్ రెబల్ స్టార్’ ఫ్యాన్స్ కు ప్రభాస్, ‘స్వీటీ’ అభిమానులకు అనుష్క, దగ్గుపాటి ప్రేమికులకు రానా… ఇలా ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి. అయితే ఇంతకీ ఈ “బాహుబలి 2” శిల్పాన్ని చెక్కిన రాజమౌళి దృష్టిలో ఎవరు అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించారు.

ఈ ప్రశ్న ఎదురైనపుడు… కొద్ది సెకన్ల పాటు ఆలోచించిన రాజమౌళి… తనవరకు అయితే బిజ్జలదేవుడు పాత్ర పోషించిన నాజర్ అద్భుతంగా నటించారని, మొదటి స్థానం ఆయనకే ఇస్తానని కాస్త తెలివిగా జవాబిచ్చారు. నిజానికి ఇతర పాత్రలలో ఉన్న బలం, నాజర్ పోషించిన పాత్రలో లేదు, అయినప్పటికీ సినిమాలో తాను ఉన్నాను అని చాటుకునే విధంగా నాజర్ నటించారు, అందుకే తన దృష్టిలో నాజర్ నెంబర్ 1 అని తేల్చిచెప్పారు జక్కన్న.

ఇక రెండవ స్థానంకు వెళితే… ఇది చాలా కష్టమైన ప్రశ్న అని… అయితే రానాకు గానీ, స్వీటీకి గానీ రెండవ స్థానం ఇస్తానని, రానాకు పెద్దగా డైలాగ్స్ లేకపోయినా, పలికించిన హావభావాలు అద్భుతమని, ముఖ్యంగా గత సినిమాలతో పోలిస్తే రానా చాలా బాగా చేసాడని, అలాగే స్వీటీ కూడా చితక్కొట్టేసిందని, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని, వీరిద్దరిలో ఎవరో ఒకరికి రెండవ స్థానం ఇస్తానని, ప్రభాస్ ను పక్కన పెట్టాడు దర్శకధీరుడు.