Rajamouli Kamal Hassan Film Companion interview కొన్ని సినిమాలు అద్భుతాలు చేస్తాయి. వాటి వెనుక ఉన్న క్రియేటివ్ జీనియస్ ల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఒక కలను కళ రూపంలో తెరమీద ఆవిష్కరించడానికి ఎంత కష్టపడ్డారు ఏమేం చేశారనే విషయాలు పాఠాలుగా ఉపయోగపడతాయి. యుట్యూబ్ లో పరుచూరి గోపాలకృష్ణ, రాఘవేంద్రరావు లాంటి ఉద్దండులు చెప్పే క్లాసులను లక్షలాది వ్యూయర్స్ ఫాలో అయ్యేది ఇందుకే. ఒకరిద్దరు చెబితేనే అంత ప్రభావం ఉన్నప్పుడు ఒకేసారి ఆరుగురు కలుసుకుంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పాలా. ప్రముఖ వెబ్ మ్యాగజైన్ ఫిలిం కంపానియన్ అలాంటి ప్రయత్నమే ఒకటి చేసింది.

దక్షిణాది పరిశ్రమ నుంచి ఆరుగురు మల్టీ టాలెంటెడ్ సెలెబ్రిటీలను ఫిలిం మేకర్స్ అడ్డా 2022 పేరుతో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. యాంకర్ మధ్యలో ఉంటూ అనుసంధానిస్తే వచ్చిన అతిథులు ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. వచ్చింది ఎవరయ్యా అంటే రాజమౌళి, కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్, పృథ్విరాజ్ సుకుమారన్, గౌతమ్ మీనన్, స్వప్న దత్ లు. ఇంతకన్నా కాంబినేషన్ ఇంకేం కావాలి. తెలుగు తమిళ మలయాళం నుంచి ప్రాతినిధ్యం వచ్చింది కానీ కన్నడ నుంచి ఎవరూ లేరన్న కామెంట్ లేకపోలేదు. రిషబ్ శెట్టి ఇంకో యాక్టర్స్ బ్యాచ్ లో కలిపేసి వేరే ప్రోగ్రాం చేశారు కానీ ఇందులో ఉంటే మరింత బాగుండేది.

ఇక్కడిదాకా సెటప్ అంతా బాగానే ఉంది కానీ తీరా కార్యక్రమం మొదలయ్యాక కమల్ హాసన్ కాస్తా గురువు పాత్రలోకి వచ్చినవాళ్లు ఇంచుమించు ఆయన శిష్యుల క్యారెక్టర్స్ లోకి వెళ్లిపోవడంతో అసలు ఉద్దేశం కాస్తా పక్కదారి పట్టింది. ఎందుకంటే అక్కడ అందరికంటే వయసు అనుభవం అన్నిటి పరంగా సీనియర్ మోస్ట్ వర్సటైల్ యాక్టర్ కమలే. ఎంత రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నా ఇరవై ఏళ్ళ క్రితమే ఆస్కార్ కు అర్హత ఉన్న స్థాయిలో సినిమాలు తీసి దర్శకత్వం వహించిన ట్రాక్ రికార్డు లోకనాయకుడికి ఉంది. సహజంగానే ఆయన చెప్పిందే వినాలని మిగిలినవాళ్లు సరెండర్ కావడంలో ఆశ్చర్యం అతిశయం ఏమి లేదు.

ఇదే ఈ ప్రోగ్రాంకు మైనస్ గా మారింది. దీనికి తోడు రాజమౌళి మీద ఉన్న విపరీత ఆరాధన ఆయన సాధించిన ఘనతలు తలుచుకుని మిగిలిన నలుగురు తమవైపు నుంచి ఏదైనా చెప్పాలనే ఉత్సాహాన్ని తగ్గించేసి ఆ ఇద్దరికీ ప్రాధాన్యం ఇవ్వాలన్న తరహాలో సాగింది. షోలే గురించి వి శాంతారాం గురించి ఇప్పటి తరానికి పెద్దగా అవగాహన లేని విషయాలే చర్చకు రావడంతో లోకేష్ స్వప్న లాంటి న్యూ జనరేషన్ మేకర్స్ శ్రోతలుగా మారడం తప్ప ఏమీ చేయలేకపోయారు. కొన్ని విలువైన విషయాలు డిస్కషన్ కు వచ్చినప్పటికి తరాల మధ్య అంతరం ప్రేక్షకుల అభిరుచులను ఎలా ప్రభావితం చేస్తోందనే విషయాల మీద ఇంకాస్త లోతుగా చర్చించి ఉంటే బాగుండేది. ఏది ఏమైనా ఒక అరుదైన కలయికకు సరైన పరమార్ధం దక్కలేదనే అనిపించింది.