Ram-Charan-and-Jr-NTR- RRRసినిమాల విజయంలో జోక్యం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు నెట్టింట హాస్యాస్పదంగా మారింది. పేద వాళ్లకు టికెట్ ధరలను అందుబాటులో ఉంచాలని చెప్తూ టికెట్ ధరలను 5 రూపాయలకు తగ్గించి సగర్వంగా చాటుకున్న ఏపీ సర్కార్, ఆ తర్వాత ఎలాంటి కారణాలు చెప్పి టికెట్ ధరలను పెంచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయానికి రాష్ట్రంలో అత్యంత పేదవారుగా ఉన్న ప్రజానీకం, 15 రోజులకు అంటే “రాధే శ్యామ్” విడుదల సమయానికి ధనికులుగా మారిపోయారని, మరో 15 రోజులు అంటే “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదల సమయానికి కుబేరులుగా అవతరిస్తున్నారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

కుబేరులుగా మారిపోతున్నారని ముందుగానే ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఉండడంతోనే, ఏకంగా 75 రూపాయలు పెంచుకునే సౌలభ్యాన్ని జగన్ సర్కార్ కల్పించిందని ఛలోక్తులు విసురుతున్నారు. ‘భీమ్లా నాయక్’ సినిమా వరకు ఒక టికెట్ ధర కూడా 75 రూపాయలు లేకపోగా, ఇప్పుడు ఏకంగా ఒక టికెట్ కు 75 రూపాయలు పెంచడమంటే, ఏపీ వాసులు అపర కుబేరులుగా మారారని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా పేర్కొంటున్నారు.

ప్రభుత్వం తీసుకునే ఒక అనాలోచన నిర్ణయాలు ప్రజలపై ఎలాంటి ప్రభావితం చూపుతాయో అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవేళ సినిమా టికెట్ ధరలు పెంచడానికి అనుమతి ఇవ్వకపోయినా విమర్శలకు గురి కావాల్సి ఉంది, అలాగే అనుమతులు మంజూరు చేసినా అంతకుమించిన విమర్శలు చవిచూడాల్సి ఉంటుంది.