Rajamouli in amaravati construction designs‘బాహుబలి’ సినిమాతో భారతీయ సినీ రంగంలో సంచలనం సృష్టించిన దర్శకుడు రాజమౌళి సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించుకోవాలని చూస్తోంది. ఆ సినిమా చూసిన వారు మహిష్మతి రాజ్యాన్ని మర్చిపోలేరంటే అతిశయోక్తి కాదేమో. ఈ క్రమంలో దేశ సంస్కృతి, చరిత్రపై మంచి పట్టున్న జక్కన్న సేవలను ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ భవనాల ఆకృతుల రూపకల్పనలో రాజమౌళి సలహాలు, సూచనలు తీసుకోవాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) అధికారులను చంద్రబాబు ఆదేశించారు. దీంతో బుధవారం మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ సహా ఇతర అధికారుల బృందం రాజమౌళితో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శాసనసభ, హైకోర్టుల నమూనాలపై సలహాలు ఇవ్వాలని కోరారు.

దాదాపు గంటపాటు రాజమౌళితో సమావేశమై రాజధానిలో నిర్మించనున్న భవనాలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల చరిత్ర, సంస్కృతులు, మూడు ప్రాంతాల్లోని రాజుల చరిత్రపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా రాజమౌళి మాట్లాడుతూ అమరావతి నిర్మాణంలో తన వంతు సహకారం అందిస్తానని, తగిన సూచనలు, సలహాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న “బాహుబలి-2” పూర్తయిన తర్వాత ఇందుకోసం తగిన సమయం కేటాయిస్తానని, తనను కలిసిన బృందానికి హామీ ఇచ్చినట్టు తెలిసింది.