rajamouli comments on ninnu kori trailerసగటు ప్రేక్షకుడు ఎలా ఆలోచిస్తారో, సరిగ్గా రాజమౌళి కూడా అలాగే ఆలోచిస్తారని చెప్పడానికి మరొక ఉదాహరణ దొరికింది. నాని హీరోగా నటించిన “నిన్ను కోరి” ఆడియో వేడుకకు విచ్చేసిన రాజమౌళి… ‘ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత తను ట్విట్టర్ లో చెప్పినట్టుగా, ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోను ఖచ్చితంగా చూస్తానని, తన చేత ఓపెన్ చేయించిన టికెట్ ఇస్తే ఇప్పుడే తీసుకెళ్ళిపోతానని’ చమత్కరించారు.

ఇక ట్రైలర్ గురించి చెప్తూ… ఒకటికి, నాలుగు సార్లు వరుసగా ట్రైలర్ చూసానని, అయితే ఎందుకు ఇన్ని సార్లు చూడాల్సి వచ్చింది అని తనను తాను విశ్లేషించుకున్న సమయంలో… తొలుత ప్రొడక్షన్స్ వాల్యూస్ కనిపించాయని, ఆ తర్వాత ఫీల్ గుడ్ సంగీతం వినిపించిందని, వీటన్నికంటే నాని నటనలో ఆత్మవిశ్వాసం కనిపించిందని, అదే తనను మళ్ళీ మళ్ళీ చూసేలా చేసిందని… రాజమౌళి వివరణ ఇచ్చుకున్నాడు.

అయితే ట్రైలర్ లో చూడడానికి కొత్తగా ఏం లేదు, కానీ ట్రైలర్ చూడగానే సినిమా చూడాలన్న ఫీలింగ్ ను తెప్పించారు అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. జక్కన్న చెప్పిన ‘ట్రైలర్ లో చూడడానికి కొత్తగా ఏం లేదు’ అన్న టాక్ సినీ ప్రేక్షకుల నుండి, విశ్లేషకుల నుండి ఇంతకు ముందే వ్యక్తమైంది. కానీ ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లోనే అలా రాజమౌళి అంతటి వ్యక్తి బహిరంగంగా అలా వ్యాఖ్యానించడం మాత్రం అవాక్కు చేసింది.