Rajamouli tweet show time movieతాజాగా విడుదలైన “షో టైం” ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ వీక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా కొత్తదనం కోరుకునే వారికి ఒక వినూత్నమైన సినిమాను అందించబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. “సినిమా ధియేటర్ కు వచ్చే వాళ్ళందరూ సినిమా చూడడానికి కాదు…” అంటూ విడుదల చేసిన టీజర్ ఆకట్టుకునేలా ఉంది. దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ఆవిష్కృతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ ను జక్కన్న ట్విట్టర్ లో పోస్ట్ చేసి “షో టైం” టీంపై ప్రశంసలు కురిపించాడు.

అయితే దీనికి ప్రతిగా రచయిత, నిర్మాత అయిన కోన వెంకట్ సీన్ లోకి వచ్చి… తమ ‘అభినేత్రి’ సినిమా కూడా ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది… ప్లీజ్ చూడండి… అంటూ హీరోయిన్ తమన్నా పోస్టర్ ను పోస్ట్ చేసాడు. రాజమౌళి చేసిన ఒక్క ట్వీట్ వలన ఒకే కాన్సెప్ట్ తో రెండు సినిమాలు నిర్మాణం అవుతున్నాయన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒకటి అతి సాధారణ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుండగా, మరొకటి తమన్నా, ప్రభుదేవా వంటి భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

ఈ రెండు సినిమా టీజర్లను పరిశీలిస్తే… ‘అభినేత్రి’ టీజర్ సినిమా కాన్సెప్ట్ కు దూరంగా ప్రభుదేవా డ్యాన్సింగ్ స్కిల్స్ ను చూపించుకోవడానికి ఉపయోగపడగా, ‘షో టైం’ టీజర్ మాత్రం కాన్సెప్ట్ ను ప్రేక్షకులకు సరిగ్గా రీచ్ చేసింది. దీంతో ‘అభినేత్రి’ కంటే కాన్సెప్ట్ పరంగా చిన్న సినిమా అయిన ‘షో టైం’ ఒక మెట్టు ఆధిక్యంలో ఉంది. కోన వెంకట్ చేసిన ట్వీట్ ప్రకారం రెండు సినిమాలు ఒకే కాన్సెప్ట్ తో తెరకెక్కాయా? లేదా? అన్నది వేచిచూడాలి.