రాజమౌళి ఏంటి అలా అనేసారు!ముంబై వేదికగా “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్ ఈవెంట్ లో బిజీగా ఉన్న రాజమౌళి, బాలీవుడ్ “బ్రహ్మాస్త్ర” ప్రమోషన్ లో కూడా పాల్గొన్నారు. ఆగష్టు 9, 2022వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా, కీలకపాత్రలో నాగార్జున కనిపించనున్నారు.

ఇందులో భాగంగా రాజమౌళి చేసిన ఓ మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ “బ్రహ్మాస్త్ర”లో టాలీవుడ్ కింగ్ నాగార్జున రోల్ గురించి స్పందిస్తూ… ఒకవేళ తెలుగు మార్కెట్ కోసమే నాగార్జునను పెట్టుకుంటే, అక్కడే ఫెయిల్యూర్ మొదలవుతుందన్న జక్కన్న సూటి వ్యాఖ్యలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

జక్కన్న దృష్టిలో ఆ క్యారెక్టర్ కు నాగార్జున అవసరం ఉండాలి గానీ, మార్కెట్ కోసం నాగార్జున కాదు అని చెప్పే ప్రయత్నం చేసారు. తాను ఎప్పుడు అలాగే చేస్తానని, ఆయా క్యారెక్టర్స్ కు ఏ నటులు సరిపోతారు అని తనకు అనిపిస్తే వారినే ఎంపిక చేసుకుంటాను తప్ప, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని కాదని తెలిపారు.

ఇక ఈ వేడుకలో పాల్గొన్న కరణ్ జోహార్ దర్శక ధీరుడిపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘బాహుబలి’ని ప్రమోట్ చేసే అవకాశాన్ని తనకు ఇవ్వమని తానే అడిగానని, రాజమౌళి ప్రతిభను బాలీవుడ్ కు చూపించడాన్ని తాను గౌరవంగా భావిస్తానని, ‘బాహుబలి’ తర్వాతే ‘పాన్ ఇండియా’ సినిమా అనేది ప్రారంభమైందని ఫ్లాష్ స్మృతులను గుర్తుకు చేసుకున్నారు.

‘బాహుబలి’ ముందు వరకు ఇండియా పరిధి దాటి రిలీజ్ అయిన సినిమాలు కేవలం పేరుకు మాత్రమే అని, ‘బాహుబలి’ అనేది నిజమైన సక్సెస్ అని, రాజమౌళి వలనే ‘ఇండియన్ సినిమా’ అన్న పదం పుట్టిందని, తన సినిమాల కోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటానని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు కరణ్.