Raja The Great Trialerఅనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన “రాజా ది గ్రేట్” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైంది. కమర్షియల్ సినిమాలలో వినోదాన్ని జోడించి ప్రేక్షకులను మెప్పించడంలో “పటాస్, సుప్రీమ్” చిత్రాల ద్వారా సక్సెస్ అయిన దర్శకుడు అనిల్ రావిపూడి, మరోసారి అలాంటి పక్కా కమర్షియల్ బొమ్మనే సిద్ధం చేసారని ఈ ట్రైలర్ చెప్తోంది. హీరో ‘గుడ్డివాడు’ అన్న విషయం పక్కనపెడితే ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి కలగడం కష్టమేమో గానీ, ఆ ‘గుడ్డితనం’తోనే ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించినట్లుగా ట్రైలర్ సంకేతాలు ఇచ్చింది.

లుక్ పరంగా రవితేజ పెద్దగా ఆకట్టుకోనప్పటికీ, ‘బ్లైండ్’ క్యారెక్టర్ ను మాత్రం బాగానే వర్కౌట్ చేసినట్లున్నారు. దర్శకుడిగా అనిల్ కు ఎలాగైతే హ్యాట్రిక్ సినిమానో, హీరోయిన్ గా మెహ్రీన్ కు కూడా ‘కృష్ణగాడి వీరప్రేమగాధ, మహానుభావుడు’ సినిమాల తర్వాత హ్యాట్రిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గత సినిమాల మాదిరే ఇందులో కూడా బొద్దుగానే ఉన్న మెహ్రీన్, తెలుగు ప్రేక్షకులకు చేరువ కావాలంటే కాస్త స్లిమ్ అవ్వాలన్న సూచనలు వస్తున్నాయి. సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ ఓకే అనిపించగా, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాలో కనిపిస్తున్నాయి.

దీపావళి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఈ ట్రైలర్ లో ప్రకటించకపోవడం గమనించదగ్గ విషయం. అయితే బాక్సాఫీస్ వద్ద ధియేటర్లను కబ్జా చేసే సినిమాలేవీ ప్రస్తుతం లేకపోవడంతో, “రాజా ది గ్రేట్” సినిమాకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవు. ఈ ఏడాది నిర్మాతగా వరుస సక్సెస్ లు చవిచూస్తున్న దిల్ రాజు ఖాతాలో మరో కమర్షియల్ సక్సెస్ కైతే మంచి స్కోప్ ఉందన్న నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.