Raja abel On mahesh Babuశేఖర్ కమ్ముల తీసిన ‘ఆనంద్’ సినిమా ద్వారా తెలుగు నాట మంచి క్రేజ్ ఏర్పరచుకున్న హీరో రాజా, ప్రస్తుతం మాత్రం తెలుగు తెరపై కనిపించడం లేదు. ఒక్క సిల్వర్ స్క్రీన్ కే కాదు, మీడియాకు సైతం దూరంగా ఉన్న రాజా, తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ప్రిన్స్ మహేష్ బాబుతో తనకున్న అనుబంధం మరియు సూపర్ స్టార్ కృష్ణ కళ్ళు ఎలా చెమర్చాయో తదితర సంగతులు చెప్పుకొచ్చారు. మహేష్ తో కలిసి తాను నటించిన ‘అర్జున్’ సినిమా తనకు ఎప్పుడూ ఇష్టమేనని చెప్పిన రాజా, తన అభిమాన హీరో కూడా మహేష్ బాబేనని స్పష్టం చేసారు.

ఒక వ్యక్తిగా మహేష్ చాలా గొప్పవాడని, తండ్రి వారసత్వంతో పాటు పద్మాలయా స్టూడియో ఇబ్బందులను, ఆర్ధిక ఇబ్బందుల నుండి కుటుంబం బయట పడడానికి కారణం మహేష్ బాబు అని, అందుకే మహేష్ జీవితం చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని, నేను కూడా మహేష్ ను చూసి గర్వపడతానని అన్నారు. మహేష్ కు తన బాధ్యతలు తనకు తెలుసని, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే… మహేష్ లో జోవియల్ యాంగిల్ ఉందని, ‘అర్జున్’ సెట్స్ మీద ఉన్నపుడు చాలా ఎంజాయ్ చేసానని గుర్తు చేసుకున్నాడు.

అలాగే ఒక సమయంలో సూపర్ స్టార్ కృష్ణ గారింటికి భోజనానికి వెళ్ళినపుడు… తాను ‘అతడు’ సినిమా గురించి చెప్పుకోచ్చానని… ఆ సినిమా విడుదల సమయంలో నేను యుఎస్ లో ఉండగా, అక్కడ ఉన్న నేను ధియేటర్ కు వెళ్లి చూశానని, అలాగే యుఎస్ ప్రేక్షకుల స్పందనను కృష్ణ గారికి చెప్తున్న సమయంలో… ఆ సంతోషానికి కృష్ణ గారి కళ్ళు చెమర్చాయని, ఆ అనుభూతి ఎప్పటికీ గుర్తుంటుందని, మహేష్ కుటుంబం చాలా మంచి ఫ్యామిలీ అని, దేవుడు ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి ఉండాలని కోరుకుంటానని రాజా ఎంతో సంతోషంగా చెప్పుకొచ్చారు.