ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్ లలో భాగంగా నేడు గ్రూప్ బి నుండి ఇండియా – శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ పై గెలిచి మెరుగైన రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా, నేడు జరిగే మ్యాచ్ లో గనుక విజయం సాధిస్తే… సెమీస్ బెర్త్ ఖరారైనట్లే. గ్రూప్ బిలో టీమిండియా మినహా అన్ని జట్లు ఒక్కో ఓటమిని చవిచూడడంతో… నేడు శ్రీలంకపై జయకేతనం ఎగురవేస్తే… దక్షిణాఫ్రికాతో ఫలితం కాస్త అటు ఇటు అయినా గానీ ఇబ్బందులు ఉండవు.

అయితే ఫాంలో లేని లంకేయులను ఓడించడం ప్రస్తుత స్థితిలో టీమిండియాకు పెద్ద కష్టమైన పనేమీ కాకపోయినా… సిరీస్ ఆద్యంతం వరుణ దేవుడు ప్రత్యక్షం అవుతుండడంతో… అసలు మ్యాచ్ జరగనిస్తాడా లేదా అన్నది కీలకంగా మారింది. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా జరిగితే టీమిండియా విజయం సాధించడం నల్లేరు మీద నడక కావచ్చు. బుధవారం నాడు జరిగిన దక్షిణాఫ్రికా – పాకిస్తాన్ మ్యాచ్ లో పాక్ అనూహ్య విజయం సాధించడంతో గ్రూప్ బి టేబుల్ రసకందాయంలో పడింది.

తొలుత బ్యాటింగ్ చేపట్టిన సఫారీలు, పాక్ బౌలర్ల ధాటికి కేవలం 219 పరుగులు మాత్రమే చేయగా, లక్ష్య చేధనలో పాకిస్తాన్ 27 ఓవర్లలో 119 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో వరుణుడు ప్రత్యక్షం కావడంతో, డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 19 పరుగుల తేడాతో పాక్ గెలిచినట్లుగా ప్రకటించారు. ఈ విజయంతో గ్రూప్ బిలో సెమీస్ బెర్త్ లపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు శ్రీలంకపై పాకిస్తాన్, సఫారీలపై టీమిండియా విజయం సాధిస్తే… పాకిస్తాన్ కూడా సెమీస్ కు చేరే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.phy