Rail neer project in Andhra Pradeshతెలంగాణా ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యంతో ప్రతిష్టాత్మక “రైల్ నీర్” ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కు వరమైంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాదాపుగా 50 కోట్ల వ్యయంతో హైదరాబాద్ లో “రైల్ నీర్” ప్రాజెక్ట్ ను స్థాపించేందుకు 2012లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఆరేళ్ళు గడుస్తున్నా అప్పటినుండి ఇప్పటివరకు కనీసం భూమిని గానీ, ఇతర మౌలిక సదుపాయాలను గానీ కల్పించలేకపోయారు. దీంతో కేసీఆర్ సర్కార్ వహిస్తున్న నిర్లక్ష్యంతో లాభం లేదని భావించిన ఐఆర్సీటీసీ ఈ ప్రాజెక్ట్ ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది.

ఏపీలోని నూజివీడు పరిసర ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ ను నెలకొల్పేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంటూ ఒక ఎకరం భూమిని కూడా కేటాయించింది. దీంతో హైదరాబాద్ లో ఉండాల్సిన ప్రాజెక్ట్ కాస్త ఏపీకి తరలిపోయింది. పెట్టుబడి రీత్యా 50 కోట్లే అయినప్పటికీ, ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా మరో 5 వేల మందికి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపాధి లభించనుంది. అంటే భవిష్యత్తులో ‘రైల్ నీర్’ బాటిల్ పైన తయారీ ప్రాంతం ఏపీలోని నూజివీడు అని చూడోచ్చన్న మాట. తెలంగాణా సర్కార్ కు ఈ చిరు ప్రాజెక్ట్ పట్ల సీత కన్ను వేసిందో ఏమో గానీ, ఏపీకి అది అనుకూలంగా మారింది.