Rahul Sipligunj  complaints on TRS MLA brotherగచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌లో దాడి ఘటనపై గాయకుడు, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అతడు.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులపై కంప్లైంట్ ఇచ్చాడు. తనతో ఉన్న యువతుల పట్ల వాళ్లు అసభ్యంగా ప్రవర్తించారని, ఇదేంటని అడిగితే.. తనపై బీర్ బాటిళ్లతో దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు.

పోలీసులు వారిపై 324, 354 మొదలైన సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. ఈ విషయంపై రాహుల్ మీడియాతో మాట్లాడారు ఈ క్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. “పొలిటికల్‌ బ్యాగ్రౌండ్‌ చూసుకుని వాళ్లు రెచ్చిపోయారు. ఎక్కడికి వెళ్లినా తమ హవా నడవాలని చూసే ఇలాంటి వాళ్ల గురించి నేను మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు,” అని అన్నాడు.

అధికార పార్టీ నాయకులకు సంబంధం ఉన్న కేసులో న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నకు కూడా అతను ఖచ్చితంగా మాట్లాడాడు. “రాజకీయ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాడు. అయితే, ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంది. ఈ వివాదం పెద్ద పెద్దవాళ్ల వరకూ వెళ్లింది. ఎట్టి పరిస్థితుల్లో విత్ డ్రా కాను. వీళ్లను చూసి ఇంకా చాలా మంది ఇలాగే తయారవుతారు. న్యాయం జరగాలి,” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇది ఇలా ఉండగా… రితేష్ రెడ్డి సన్నిహితులు మాత్రం రాహుల్ సిప్లిగంజ్.. తమతో వచ్చిన ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించడంతో మేము వద్దని వారించాము. కానీ అతను మా మాట వినకపోవడంతో పాటు మాపై దాడికి యత్నించడంతో మేము ఆత్మరక్షణలో భాగంగా అతనిపై దాడికి యత్నించినట్టు చెప్పుకొచ్చారు.