Rahul Gandhi Responds On Disqualified From Lok Sabhaకాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ళు జైలు శిక్ష విధించిందనే సాకుతో కేంద్ర ప్రభుత్వం ఆయనపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ శనివారం ఢిల్లీలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ , “నాపై అనర్హత వేటువేస్తేనో లేదా జైలుకి పంపిస్తోనో నేను భయపడి క్షమాపణ చెప్పి లొంగిపోను. ఎందుకంటే నేను గాంధీని… ప్రశ్నిస్తూనే ఉంటాను.

లోక్‌సభలో నేను అదానీ సూట్ కేసు కంపెనీల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నప్పుడు నాకు మోడీజీ కళ్ళలో భయం కనబడింది. నన్ను లోక్‌సభలో ఇంకా ఉండనిస్తే ఇంకెన్ని రహస్యాలు బయటపడతాయో అనే భయంతోనే నాపై అనర్హత వేటు వేశారని భావిస్తున్నాను. అయితే నేను లోక్‌సభకు రాలేకపోయినా మోడీ-అదానీ బందం గురించి ప్రశ్నిస్తూనే ఉంటాను. అదానీ సూట్ కేసు కంపెనీలలోకి రూ.20,000 కోట్లు ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చిపడ్డాయో చెప్పేవరకు మేము పార్లమెంటులోపల, బయటా గట్టిగా ప్రశ్నిస్తూనే ఉంటాము.

మేము ఆదానీ గురించి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుండటంతో దేశ ప్రజల దృష్టిని ఆయనపై నుంచి మళ్ళించేందుకే నాపై అనర్హత వేటువేశారని భావిస్తున్నాను. కానీ మేము పార్లమెంటులో అదానీ గురించి ప్రశ్నిస్తుంటే, మోడీ ప్రభుత్వం అదానీని ఇంతగా వెనకేసుకు వచ్చి కాపాడాలని ఎందుకు ప్రయత్నిస్తోంది?

అదానీ-మోడీల దోస్తీ ఈనాటిది కాదు కనుకనే. నరేంద్రమోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే వారి దోస్తీ కొనసాగుతోంది. దానిని నేను తప్పు పట్టను. కానీ తమ దోస్తీ కోసం దేశ సంపదను అదానీకి దోచిపెడతానంటే ఊరుకోను. ప్రశ్నిస్తూనే ఉంటాను. అదానీ అంటే భారత్‌, భారత్‌ అంటే అదానీ… అన్నట్లు తయారైంది ఇప్పుడు. దేశంలో రక్షణ రంగంతో అన్ని వ్యవస్థలు, అన్ని సంస్థలు అదానీకే ఎందుకు?అంటే అదానీతో దోస్తీ కోసమేనా అంతకు మించి ఇంకేమైనా ఉందా?అనే సందేహం కలుగుతోంది. కనుకనే కాంగ్రెస్ పార్టీ అదానీ నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి అలుపెరుగని పోరాటం చేస్తోంది,” అని అన్నారు.