rahul_gandhi AICC restructureఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీలో పెను మార్పుల దిశగా అధిష్టానం అడుగులు వేస్తోంది. పార్టీలో ప్రక్షాళనే లక్ష్యంగా వృద్ధ నేతలను తప్పించి, పార్టీ కోసం పాటుపడుతున్న అంకితమైన యువనేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని, బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు బలమైన జట్టును తయారు చేయాలని రాహుల్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వృద్ధ నేతలకు ‘రాం… రాం…’ చెప్పాలని నిర్ణయించారు.

గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. ప్రభుత్వ ఏర్పాటులో పార్టీ ఇన్‌ చార్జ్ దిగ్విజయ్‌ సింగ్ ఘోరంగా విఫలమయ్యారని, పార్టీకి భారంగా మారిన నేతలను వదిలించుకోవాలని రాహుల్ నిర్ణయించినట్టు జన్‌ పథ్ వర్గాలు చెబుతున్నాయి. చికిత్స కోసం విదేశాలకు వెళ్లి ఇటీవల భారత్ తిరిగొచ్చిన పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో రాహుల్ ఈ విషయమై ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది.

వీలైనంత త్వరగా కొత్త కార్యవర్గాన్ని నియమించాలని భావిస్తున్న అధిష్ఠానం.. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు సహా పార్టీ అనుబంధ విభాగాలకు ఈ సారి కొత్త వారిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా రాహుల్ తన సొంతం టీంతో సర్వే సైతం నిర్వహించినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న వారిని గుర్తించి పదవులు ఇవ్వాలన్న అభిప్రాయం సర్వేలో వ్యక్తమైంది. దీంతో భారీ మార్పులకు రాహుల్ సిద్ధమవుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక, రెండు తెలుగు రాష్ట్రాలకు ఇన్‌ చార్జ్‌ గా వ్యవహరిస్తున్న దిగ్విజయ్‌ సింగ్‌ కు ఉద్వాసన పలకాలని నిర్ణయించారు. దిగ్విజయ్ ను పక్కనపెట్టి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా ఇన్‌ చార్జ్‌ లను నియమించాలని భావిస్తున్నారు. పార్టీ ప్రక్షాళన కంటే ముందే ఈ మార్పు ఉండే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణలకు ఇన్‌ చార్జ్‌ లను నియమించే ముందు రెండు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో రాహుల్ చర్చించనున్నట్టు సమాచారం.