AP PCC President Raghuveera Reddy review on Elections 2019రాష్ట్ర విభజనతో సర్వం కోల్పోయి సున్నాగా మారిన కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని బేరీజు వేసుకునేందుకు సిద్ధమవుతుంది. 2014లో ప్రజల నుంచి ఎదురైన ఆగ్రహ జ్వాలలు 2019 నాటికి కన్పించలేదని దీనితో కాస్తో కూస్తో మెరుగైన ఫలితాలే వస్తాయని వారు అనుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామనీ, పోలవరం ప్రాజెక్టుకు 100% కేంద్రం నిధులు అందిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు.

ఇది తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 172 చోట్ల, లోక్‌సభ స్థానాల్లోనూ అభ్యర్థులు బరిలో దిగారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల సరళిపై ఈ నెల 16 నుంచి 19 వరకూ నాలుగు రోజుల పాటు పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరా రెడ్డి సమీక్షిస్తారు. బూత్‌ల వారీగా ఎన్నికల సరళిని వీరు నేతలనుంచి తెలుసుకుంటారు. అంచనాలు రూపొందించుకుని ఎన్నికల ఫలితాలు వచ్చాక వాటితో కంపేర్ చేసుకుంటారట.

అయితే ఇప్పటి వరకూ వచ్చిన సర్వే ఫలితాల ప్రకారం కాంగ్రెస్ కు కనీసం 1% ఓట్లు కూడా పడవు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రఘువీరారెడ్డికి మాత్రమే 15-20% శాతం ఓట్లు అది కూడా ఆయన సొంత బలం మీద సాధిస్తారని సమాచారం. కాంగ్రెస్ ఎంతో కొంత బలపడితే ఆ ప్రభావం వైఎస్సార్ కాంగ్రెస్ మీద పడుతుంది అధికార తెలుగుదేశం పార్టీ భావించింది. అయితే అటువంటి ప్రభావమేమి ఆ పార్టీ చూపించలేకపోయిందని విశ్లేషకుల సమాచారం. ఇంతోటి దానికి సమీక్షలా?