APPCC President Raghuveera Reddy comments on YS Jagan - YSRCPఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత స్మశాన వేదికగా ‘త్వరలో కాబోయే సిఎం జగన్’ అంటూ నినాదాలు చేసిన మొదటి వ్యక్తి రఘువీరారెడ్డి. కాంగ్రెస్ నుండి బయటకు వస్తూ జగన్ వైసీపీని ఏర్పాటు చేసిన సమయంలో జగన్ పక్షాన రఘువీరా నిలుస్తారన్న వార్తలు హల్చల్ చేసాయి. అయితే, రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తిగా రఘువీరా కాంగ్రెస్ ను అంటిపెట్టుకునే ఉండి, ఏపీ పీసీసీ పదవిని సొంతం చేసుకున్నాడు.

అలాంటి ప్రతిష్టాత్మక పదవిలో ఉన్న రఘువీరా తాజాగా చేసిన ప్రకటనలు రాజకీయ పరంగా చర్చనీయాంశమయ్యాయి. “కాంగ్రెస్ లో కలిస్తేనే జగన్ కు భవిష్యత్తు ఉంటుందని, తన తప్పు తెలుసుకుని తిగిరి కాంగ్రెస్ లో చేరాలని, వైసీపీని ప్రజలు ఆదరించరని, త్వరలోనే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని, కష్టపడిన వారిని గుర్తించే పార్టీ కాంగ్రెస్ అని, ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని” పరోక్షంగా, ప్రత్యక్షంగా కాంగ్రెస్ లో చేరాల్సిందిగా జగన్ కు సంకేతాలు పంపారు రఘువీరా.

పీసీసీ పదవిలో ఉన్న రఘువీరా వ్యాఖ్యలను పరిశీలిస్తే… బ్యాక్ గ్రౌండ్ లో ఏదో జరుగుతుందన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. పవన్, జగన్ లను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తామని ఇటీవల చింతా మోహన్ వంటి వారు చేసిన వ్యాఖ్యలకు పెద్దగా ప్రాధాన్యత లభించనప్పటికీ, పీసీసీ స్థాయిలో ఉన్న వారు అదే వ్యాఖ్యలకు పునరావృతం చేస్తే ఖచ్చితంగా వాటికి బలం చేకూరుతుంది.

అయితే ఈ వ్యాఖ్యలతో అసలు రఘువీరా ఏం చెప్పాలనుకుంటున్నారు? జగన్ మీద కాంగ్రెస్ కు ఉన్న ప్రేమను తెలియజెప్పారా? లేక కేసులను ఎదుర్కొంటున్న జగన్ కు భవిష్యత్తు తారుమారు అయిన పక్షంలో కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం అందివ్వడానికి సిద్ధమని చెప్తున్నారా? లేక జగన్ కు మరో ప్రత్యామ్నాయం ఉందని గుర్తు చేస్తున్నారా? ఏది ఏమైనా రఘువీరా కాస్త ఎక్కువగానే జగన్ పై ఫోకస్ చేస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.