raghuramakrishna raju about his resignation ఫిబ్రవరి 5వ తేదీ వరకు నన్ను డిస్ క్వాలిఫై చేసే అవకాశాన్ని ముందుగా వైసీపీకి ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే పార్లమెంట్ సమావేశాలు మరో వారం రోజులు పొడిగించినందున 11వ తేదీ వరకు తాను వైసీపీ వారికి సమయం ఇచ్చానని, అప్పటి లోపున తనను డిస్ క్వాలిఫై చేసి తమలో చావ ఉందని నిరూపించుకోవాలని రఘురామకృష్ణంరాజు మరోసారి సవాల్ విసిరారు.

తాను ఎప్పుడు రాజీనామా చేస్తానో వాళ్లకు అనవసరం, మీకు దమ్ముంటే డిస్ క్వాలిఫై చేసుకోమని చెప్పాను కదా, అయినా నా సొంత డబ్బులతో నేను గెలిస్తే మీరు చెప్పినపుడు నేనెందుకు రాజీనామా చేస్తాను అంటూ కౌంటర్ ఇచ్చారు. గతంలో రాజీనామా చేస్తానంటే తనను మాటలతో రెచ్చగొట్టారు, అందుకే మీకు అవకాశం ఇచ్చాను, రాజీనామా అయితే చేస్తాను, అది మీరు చెప్పినపుడు కాదని అన్నారు.

త్వరలో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతుందో ఆ సమయం చూసి రాజీనామా చేస్తానని, వీలైనంత ఎక్కువ కాలం ఎంపీగా ఉండాలనే ఆకాంక్షతోనే రాజీనామా చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. ఒక ఎంపీగా ఉన్నందు వలనే, తాను ఇదంతా చేయగలుగుతున్నానని చెప్పిన ఆర్ఆర్ఆర్, తాను తీసుకున్న చర్యలన్నీ లేదా కోర్టులలో వేసిన కేసులన్నింటికీ త్వరలో తీర్పులు వస్తాయని అభిలాషించారు.

అలాగే ఒక ఎంపీగా ఉన్నందు వలనే పీఎంవోకు అనేక లేఖలు రాయగలిగాను, అలాగే పీఎంవో నుండి సమాధానం వచ్చియున్నది, అలా కాకుండా సామాన్యుడుగా అయితే ఇవన్నీ సాధ్యం కాదు గనుక, మా పార్టీ చేస్తోన్న ద్రోహాలన్నీ ఎత్తి చూపి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి నాకు ఎంపీ పదవి అవసరం అన్న విషయాన్ని రఘురామకృష్ణంరాజు సవివరంగా తెలిపారు.

మీకిచ్చిన గడువు 11వ తేదీతో అయిపోతుంది, ఆ తర్వాత తన నిర్ణయం తాను తీసుకుంటానని, చవటల్లారా… ఆ రోజున నేను రాజీనామా చేస్తానని అనలేదని ఘాటుగా స్పందించిన ఆర్ఆర్ఆర్, ముఖ్యమంత్రి గనుక ఇక నేను డిస్ క్వాలిఫై చేయలేను, నువ్వు రాజీనామా చేసేయమంటే తృణప్రాయంగా నా రాజీనామాను అలా పడేస్తా ముఖాన అని అన్నారు.

ఉరికే నాకు ఫోన్ చేయడం కాదురా దరిద్రుల్లారా… దమ్ముంటే మాట్లాడగలిగితే ముఖ్యమంత్రితో మాట్లాడుకోండి, నాకు మెస్సేజ్ లు ఇస్తున్న మా దరిద్రులకు చెప్తున్నా… అంటూ ఆర్ఆర్ఆర్ ముగించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ జగన్ ఎలా అయితే జాతీయ పార్టీని ఇబ్బందులు పెట్టారో, సరిగ్గా అదే రీతిలో ఆర్ఆర్ఆర్ కూడా ‘జగన్ అండ్ కో’కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.