raghurama krishnam raju gives simple offer to jaganప్రజలు బికారి… ముఖ్యమంత్రి దురహంకారి… ఊరెళ్లాలంటే లేదు దారి… ప్రజలకు లేదు బ్రతుకు దారి… రాష్ట్రం ఎడారి..! ఇది క్లుప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల గురించి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన తాజా కామెంట్స్.

అమరావతి యాత్రలో తాను పాల్గొన్న కారణాన్ని చూపించి తనపై అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని, తాను మాత్రం ఫిబ్రవరి 5 వరకు సమయం ఇస్తున్నానని, అప్పటికి చేయలేకపోతే వీళ్ళని చేతగానివాళ్లుగా గుర్తించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా తాను ముఖ్యమంత్రికి ఒక వెసులుబాటు ఇవ్వదలచుకున్నానని, ఇది సింపుల్ ఆఫరేనని చెప్పిన ఆర్ఆర్ఆర్… మా ముఖ్యమంత్రి గనుక ఓ 10 సార్లు “అనర్హత” అనగలిగితే, తాను వైసీపీకి రాజీనామా చేయడానికి సిద్ధమేనని ఛాలెంజ్ విసిరారు.

స్పష్టంగా తెలుగులో ‘అనర్హత’ అని మాత్రమే అనాలని, అననర్హత అని ఏదొక విధంగా అంటే కుదరదని తెలిపారు. ఫిబ్రవరి 5 తర్వాత కూడా తనపై అనర్హత వేటు వేయలేని పక్షంలో వాళ్ళు అంగీకరించినా, లేకున్నా వాళ్ళు ఓటమి చెందినట్లుగా భావించి తాను రాజీనామా చేస్తానని అన్నారు.

అప్పటికి కూడా తాను రాజీనామా చేయలేని పక్షంలో ఎన్నికలకు వెళ్ళడానికి తన దగ్గర సమయం ఉండదని, అందుకనే అప్పటివరకు సమయం ఇచ్చానని తెలిపారు. జగన్ పట్ల ప్రజల్లో ఎంత ఏహ్య భావన ఉందో నర్సాపురం ఎన్నికల ఫలితాలు నిరూపిస్తాయని అన్నారు.

తిరుపతి, కుప్పం మాదిరి పక్క నుండి లుంగీ బ్యాచ్ లను తీసుకురావడం ఇక్కడ కుదరదని, మా ‘ఆయ్’ బ్యాచ్ ఎవరూ దొంగ ఓట్లు వేయడానికి రారని, వాళ్ళ ‘అప్పా’ బ్యాచ్ చిప్పలు పగలగొడతాం, ఇబ్బంది లేదు, కేంద్ర బలగాలు ఉంటాయి, ప్రజల మార్పుకు నాందిగా ఈ ఎన్నికలు జరుగుతాయని వివరించారు.

ఈ సంక్రాంతికి తన స్వగృహమైన భీమవరం వెళ్తున్నానని, నేనైతే మా ముఖ్యమంత్రి గారి లాగా స్మైల్స్ ఇచ్చుకుంటా తిరగనని, మూతికి మాస్క్ పెట్టుకుంటానని, నా ప్రతి కదలిక ఇద్దరు మనుషులు వీడియోలు తీస్తారని, ఒక మీడియా టీమ్ ని కూడా వెంటపెట్టుకుని వెళ్తానని చెప్పారు.