Raghurama Krishna Raju comments on ys jagan   అందాల విశాఖ నగరాన్ని కూడా ధ్వంసం చేస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి ఆ నగరానికి ఓ శాపం వంటివాడని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. జగన్ నుంచి విశాఖ నగరాన్ని, అందాల రుషికొండను కాపాడుకోవడం కోసం తాను చివరి వరకు న్యాయపోరాటం చేస్తానని అన్నారు. విశాఖలో చదువుకొన్నందున నగరంతో తనకు అనుబందం ఏర్పడిందని, కనుక విశాఖ రుణం ఈవిదంగా తీర్చుకోవాలనుకొంటున్నానని రఘురామ అన్నారు.

రుషికొండ సముద్రతీరాన్ని ఆనుకొని ఉండటంతో దానిపై జగన్ కన్ను పడిందని, అమరావతిని రాజధానిగా అంగీకరించలేకపోతున్న జగన్, రుషికొండపై తన కార్యాలయాలు ఏర్పాటు చేసుకొనే ఆలోచనతోనే కొండను తవ్వించేసి చదును చేయిస్తున్నారని రఘురామ ఆరోపించారు.

మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో కొండను చదును చేయిస్తూ, మరోపక్క అక్కడ పనులేమీ జరగట్లేదని సుప్రీంకోర్టును కూడా మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రుషికొండ సీఆర్ జెడ్-2 లేదా సీఆర్ జెడ్-3లోకి వస్తుందా? అనే విషయం తేల్చకుండా, కోట్లు ఖర్చు పెట్టి పర్యాటకరంగం కోసం అభివృద్ధి చేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అబద్దాలు చెపుతోందని రఘురామ ఆరోపించారు.

రాష్ట్రానికి గుండెకాయ వంటి రాజధాని అమరావతిలో నిర్మాణపనులు మొదలుపెట్టమని హైకోర్టు చెపితే డబ్బు లేదని చెపుతున్న జగన్ ప్రభుత్వం, అత్యవసరం కాకపోయినా రుషికొండలో ఎందుకు కోట్లు ఖర్చు పెట్టి కొండను తవ్వించేస్తోందని రఘురామ ప్రశ్నించారు. జగన్ ముచ్చట కోసమే కోట్లు ఖర్చు చేసి రుషికొండను చదును చేస్తున్నారని రఘురామ ఆరోపించారు. ఈ పనులకు డబ్బు ఉన్నప్పుడు అమరావతి నిర్మాణ పనులకి ఎందుకు లేదని ప్రశ్నించారు. రుషికొండపై ఉన్న భవనాలకు అదనంగా మరికొన్ని నిర్మించి పర్యాటక అభివృద్ధి చేస్తామని చెపుతున్నప్పటికీ జగన్ తన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడానికే అక్కడ పనులు చేయిస్తున్నారని రఘురామ ఆరోపించారు.

రేపు సుప్రీంకోర్టులో జరుగబోయే విచారణలో పూర్తి సాక్ష్యాధారాలతో సహా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిరూపించి రుషికొండను కాపాడుతానని అన్నారు. విశాఖ ప్రజలు కూడా రుషికొండను కాపాడుకోవడం కోసం పోరాడవలసిన సమయం ఆసన్నమైందని ఎందుకంటే రుషికొండ పునర్నిర్మించుకోగల కట్టడం కాదని రఘురామ కృష్ణరాజు అన్నారు.