జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టుకు!ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేస్తుందేమో అన్న భావనను వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వెలిబుచ్చారు. ఎందుకంటే ఈ రోజు సాక్షి పత్రికలో వాళ్ళు అంత నమ్మకంతో రాసారని, వాళ్ళ విశ్వాసం చూస్తుంటే నిజంగానే తాను దాఖలు చేసిన పిటిషన్ కోర్టు కొట్టివేస్తుందేమో అన్న అభిప్రాయానికి తాను వచ్చేసానని అన్నారు.

అదే జరిగితే తాను సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుందని తదుపరి కార్యాచరణపై కూడా ఆర్ఆర్ఆర్ ‘హింట్’ ఇచ్చారు. అలాగే విచారణకు జగన్ హాజరయ్యే అంశం కూడా కోర్టులో పెండింగ్ ఉందని, దీనిపై కూడా సాక్షి ‘వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు’ అని రాసిందని, అలా కూడా జరగొచ్చు అని ఆర్ఆర్ఆర్ తెలిపారు. ఫైల్ చేయడానికి నాకు అర్హత ఉందని క్రింద కోర్టు చెప్పినా కూడా సాక్షిలో రాసినట్లుగా ఫైల్ చేయడానికి తనకు అర్హత లేకుండా కూడా పోవచ్చేమోనని ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

ఒకేసారి మూడు శాఖలకు పనిచేసిన మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలకు ప్రాముఖ్యత ఉంటుందని అన్నారు. ఆయన అన్నట్లుగా ఎర్ర చందనం స్మగ్లింగ్ లో చంద్రబాబు ఉన్నపుడు ఓ టాస్క్ ఫోర్స్ ను నియమించారని, జగన్ వచ్చాక దానిని తీసేశారని, ఒక మాజీ అటవీ శాఖా మంత్రిగా ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు చాలా సీరియస్ గా పరిగణించదగినవని తెలిపారు. కనుక వెంటనే ఆ టాస్క్ ఫోర్స్ ను నియమించి, జగన్ తనపై వచ్చిన నీలాపనిందలను తొలగించుకోవాలని అన్నారు.