Raghu Rama Krishnam Raju questions vijayammaవైఎస్సార్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు నిన్న హైదరాబాద్ లో షర్మిలకు జరిగిన అవమానం పై తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు కొన్ని కీలక ప్రశ్నలు సంధించారు. “షర్మిల గారి పట్ల తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరం. ఆడ పోలీసులే అయినా పెనుగులాటలో జాకెట్టు చిరిగే వరకు వెళ్ళింది అంటే కేసీఆర్ గారు సదరు అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి,” అని ఆయన అన్నారు.

“ఈ విషయంగా మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కూడా విచారం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి. అమరావతిలో మహిళా రైతుల పట్ల ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంతకంటే దారుణంగా వ్యవహరించారు. పైగా వారు మగ పోలీసులు. తెలంగాణలో కనీసం కొంతమేర నిరసన తెలుపుకునే అవకాశం ఇచ్చారు. ఇక్కడ అది కూడా లేదు,” అని అన్నారు.

“మీరు ఆ విషయం గా మీ కుమారుడితో తప్పని చెప్పాలి కదా? మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు గా మీరు మా పార్టీ గౌరవం నిలబెట్టాలి. ఆ బాధ్యత మీరే తీసుకోవాలి. అమరావతి మహిళల విషయంగా సాటి మహిళగా షర్మిల విషయంలో స్పందించినట్టుగానే స్పందించాలి,” అని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు.

ఇది ఇలా ఉండగా… తన లోటస్ పాండ్ ఇంట్లో షర్మిల తన నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు.ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలంటూ చేపట్టిన మూడు రోజుల దీక్ష రెండో రోజుకు చేరింది. విజయమ్మ ఆమెతో పాటే ఉండి జాగ్రత్తగా చూసుకుంటున్నారు.