YS Jagan - AP Employees Unionఉద్యోగ సంఘ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బహిరంగంగా వెల్లడించినా లేకున్నా ఉద్యోగులైతే “ఆ నలుగురు”పై తీవ్రస్థాయిలో మండిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రఘురామకృష్ణంరాజు లాంటి వారైతే నేరుగానే తమ పదజాలానికి పదును పెడుతూ తనదైన శైలిలో ఎటకారంతో కూడిన విమర్శల వర్షం కురిపించారు.

ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ అయిన బండి శ్రీనివాసరావు డాన్స్ ల గురించి ప్రస్తావిస్తూ… ఆయనెవరో బాగా చేశారయ్యా, నా కంటే లావుగా ఉన్నా కూడా స్టెప్స్ బాగా వేసారు, నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసాడు, ఎన్టీఆర్ పాటకు ఏఎన్నార్ స్టైల్ లో స్టెప్పులు వేసారంటే, బహుశా ఆయన ఏఎన్నార్ అభిమాని ఏమో గానీ చాలా బాగా చేసారంటూ చమత్కరించారు.

రేపు ఉద్యోగం కాస్త అటు ఇటు ఏదైనా గానీ స్టేజ్ మీద రికార్డింగ్ డాన్స్ లు వేసుకుంటూ బతికేస్తాడు అంటూ తనదైన వ్యాఖ్యానించారు. ఇక గతంలో చంద్రబాబు 43% ఫిట్ మెంట్ ఇచ్చిన సమయంలో ‘నేను థాంక్స్’ ఎందుకు చెప్పాలి అన్న సూర్యనారాయణ, 23% ఫిట్ మెంట్ కు థాంక్స్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అలా మాట్లాడిన వాడు మనిషా? అంటూ నిలదీసారు.

దీనికి మీడియా ప్రతినిధులు ‘మరి లోపల ఏం జరిగి ఉంటుంది?’ అని ఆర్ఆర్ఆర్ ను తిరిగి ప్రశ్నించగా, ఏం జరిగి ఉందేంటి… ‘శివాజీ’ సినిమా సీన్. చర్చించుకుందాం రా అని లోపలికి తీసుకువెళ్లి ‘అప్పడం’ మాదిరి అయిపోవడమేనన్న హావభావాలను ప్రదర్శించారు. ‘శివాజీ’ సినిమానే కాక మన చిరంజీవి గారబ్బాయి చరణ్ సినిమా ‘నాయక్’లో కూడా ఇలాంటి సీన్ ఉంటుందని ఉదహరించారు.

ఆ నలుగురిలో ఎవరో ఒకరైతే అమరావతిలో ఒక ఎకరం పొలం కూడా కొన్నారని, బొప్పరాజు అయితే ఏకంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారని గుర్తు చేసారు. ఏది ఏమైనప్పటికీ 43 శాతం ఇచ్చిన వ్యక్తిని విమర్శించి, 23 శాతం ఇచ్చిన వ్యక్తిపై ప్రశంసలు కురిపించారంటే ‘సంథింగ్ ఈజ్ రాంగ్’ అన్న అభిప్రాయాన్ని రఘురామకృష్ణంరాజు వ్యక్తపరిచారు.