YS Jagan and Raghu Rama Rajuఏపీలో రాజకీయాలకు సంబంధించి రోజుకొక వ్యవహారం జరుగుతూ ఉంటుంది. రోజుకొక రకంగా జగన్ నిర్ణయాలు తారుమారు అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో అవసరాన్ని బట్టి నాయకులు మాట మారుస్తూ ముందుకు పోతున్నారు. అయితే, ఎవరు ఎటు పోయినా, ఎవరు ఏమైపోయినా జగన్ పై రఘురామ కృష్ణంరాజు యుద్ధం మాత్రం ఆగడం లేదు. వదల జగన్….నిన్ను వదలా! అంటూ రాజుగారు రెచ్చిపోతున్నారు.

సహజంగా రాజులు పోరాట వీరులు అని ప్రసిద్ధి. శత్రువుల పై బరిలోకి దిగిన తర్వాత, గెలుపు అందే వరకూ పోరాటం ఆపరు. రఘురామ కృష్ణంరాజు వ్యవహారం చూస్తుంటే.. ఇది నిజమే అనిపిస్తుంది. అసలు తన పార్టీ అధినేత పైనే ఈ స్థాయి పోరాటం చేసే వ్యక్తిని ఇప్పటి వరకు చూడలేదు అంటూ రాజకీయ ఉద్దండులు కూడా రాజు గారిని చూసి ఆశ్చర్యపోతున్నారు.

అయితే, రఘురామకృష్ణంరాజు పోరాటానికి ఊరట లభించింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన వేసిన పిల్‌ కు నెంబర్ కేటాయించమని తెలంగాణ హైకోర్టు ఆదేశించడం నిజంగా విశేషమే. జగన్ అక్రమాస్తుల కేసు పై 10 నెలల క్రితమే రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి.. అప్పటి నుంచి అలుపెరగని వీరుడిలా ముందుకు సాగుతున్నాడు.

నిజానికి గత కొన్ని ఏళ్లుగా జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఈడీ, సీబీఐ కేసులు పెండింగ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి కాబట్టి.. ఇన్నాళ్లు ఈ కేసులో జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే, ఆ జాప్యాన్ని ప్రశ్నిస్తూ రఘురామకృష్ణంరాజు ప్రజాప్రతినిధుల కేసులను ఇంకాస్త త్వరగా విచారణ చేయాలని కోరుతూ వచ్చారు.

ఇన్నాళ్లకు, రాజు గారి కోరికలో వాస్తవం, న్యాయం దాగి ఉన్నాయని గమనించిన సుప్రీం కోర్టు.. తక్షణమే జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని.. పిల్‌ కు నెంబర్ కేటాయించింది. మరి తెలంగాణ హైకోర్టు విచారణలతో సరిపెడుతుందా ? లేక, నిజంగానే తీర్పును ఇస్తోందా ? అనేది చూడాలి.