raghu rama krishna rajuఒక్క విశాఖ నగరంలోనే సముద్రం తీరం వెంబడి సుమారు పది అందమైన బీచ్-పార్కులున్నాయి. వాటిలో రుషికొండ బీచ్ పార్క్‌ కూడా ఒకటి. అక్కడికి దేశం నలుమూలల నుంచి నిత్యం పర్యాటకులు వస్తుంటారు. కనుక అటువంటి పర్యాటక ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తే మరింత ఎక్కువమంది అక్కడికి వస్తారు.

కానీ రుషికొండ బీచ్‌లో కనీస సౌకర్యాలు కూడా ఉండవు. పచ్చదనం, పరిశుభ్రత లేనే లేవు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు, ముఖ్యంగా విద్యార్దులు, యువతకు రుషి కొండ బీచ్‌ ప్రమాదకరమైనదని తెలియక సముద్రంలో దిగి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకొంటూనే ఉన్నారు. కానీ అక్కడ ఎటువంటి భద్రతా వ్యవస్థ కనపడదు.

సాధారణంగా ప్రజలు, పర్యాటకులు సాయంత్రం పూట బీచ్‌కు వస్తుంటారు. కానీ సాయంత్రం చీకటి పడితే రుషి కొండ బీచ్‌లో చిమ్మ చీకటి అలుముకొంటుంది. సుమారు 4-5 కిమీల మేర విస్తరించిన రుషికొండ సముద్ర తీరానికి, బీచ్‌ పార్కుకు ఒకే ఒక హైమాస్క్ లైటు దిక్కు! దీంతో చీకటిపడితే అసాంఘిక కార్యక్రమాలకు రుషికొండ బీచ్‌ నెలవుగా మారుతుంది.

ఇన్ని సమస్యలు కంటికి కనిపిస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం దృష్టి పక్కనే ఉన్న రుషికొండపై పడింది. దానిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పి రేయింబవళ్ళు జేసీబీలు, లారీలు పెట్టి మట్టిని తవ్వించేసి బయటకి తరలించేస్తూ అంత పెద్ద కొండను తొలి చేస్తూ ప్రకృతిని విధ్వంసం చేస్తోంది. దీనిపై పర్యావరణ ప్రేమికులు, నగరంలో ప్రజలు తీవ్ర అభ్యంతరాలు చెపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఇది వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దృష్టికి వెళ్లడంతో ఆయన నేషనల్ గ్రీన్‌ సిగ్నల్‌ ట్రిబ్యూనల్‌ (ఎన్‌జీటి)లో ఓ పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ జరిపిన ఎన్‌జీటి బెంచ్ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు మట్టి తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాదు… నిబందనలకు విరుద్దంగా ఇప్పటి వరకు జరిపిన తవ్వకాలపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించేందుకు నలుగురు సభ్యులతో కూడిన ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రుషికొండను అసలు ఎందుకు తవ్వేస్తున్నారు?అక్కడ తవ్విన మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారు? తవ్వకాలతో నిబందనలు ఉల్లంఘన జరిగిందా లేదా? తదితర అంశాలపై అధ్యయనం చేసి నాలుగు వారాలలో నివేదిక ఇవ్వాలని ఎన్‌జీటి ఆదేశించింది.

పర్యాటకులను ఆకర్షించాలంటే కొండలు తవ్వసి వాటిపై పెద్ద పెద్ద పార్కులు, హోటల్స్ కట్టించక్కరలేదు. సముద్రతీరం వెంబడి పార్కులను అభివృద్ధి చేసి, కనీస సౌకర్యాలు కల్పిస్తే చాలు.