Raghu_Rama_Krishna_Raju_Anam_Kotamreddy_Sridhar_Reddyవైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు పార్టీకి దూరం అయినప్పటి నుంచి ఢిల్లీలో కూర్చొనే వైసీపీ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా మారి ముప్పతిప్పలు పెడుతుండటం అందరికీ తెలిసిందే. కారణాలు ఏవైతేనేమీ జగన్మోహన్ రెడ్డి ఆయనని వైసీపీలో నుంచి బహిష్కరించలేకపోయారు. కనుక ఆయన కూడా తాను వైసీపీ ఎంపీనని చెప్పుకొంటూ తమ అధినేత పరువుని, తమ ప్రభుత్వం పరువు తీస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో టిడిపి, జనసేనలతో చెడుగుడు ఆడుకోగలుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఆయనని మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు.

ఇప్పుడు వైసీపీలో మరో ఇద్దరు రఘురామరాజులు పుట్టుకొచ్చారు. వారే నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి. ఇద్దరూ బహిరంగంగానే జగన్‌ మీద, వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.

వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వీడి బయటకి వచ్చేసారు కానీ పదవికి రాజీనామా చేయబోనని చెప్పేసారు. కనుక పార్టీలోనే ఉంటూ ఎండగట్టేస్తున్నారు. ఆయనని వైసీపీ నేతలు ఎంత ధీటుగా ఎదుర్కొంటే అంతకి రెట్టింపు శక్తితో వారిని ఆయన ఢీకొంటున్నారు. ఈరోజు కూడా ఆయన మళ్ళీ ప్రెస్‌మీట్‌ పెట్టి తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి సిఎం జగన్‌ నిధులు కేటాయించిన్నట్లు ప్రకటించి, నిధులు విడుదల చేయకుండా ఏవిదంగా మోసం చేశారో సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని దెబ్బ తీసే ప్రయత్నంలో వైసీపీ నేతలు తమ ప్రభుత్వ వైఫల్యాలని ఆయన నోటితోనే బయటపెట్టించుకొంటున్నరని అర్దమవుతోంది. ఆయన చేస్తున్న విమర్శలు, బయటపెడుతున్న నిజాలు యావత్ రాష్ట్ర ప్రజలకి చేరుతున్నాయి. వాటితో వైసీపీకే నష్టం తప్పఆయనకి కాదని వేరే చెప్పక్కరలేదు. మహా అయితే ఆయన వచ్చే ఎన్నికలలో ఓడిపోవచ్చు లేదా వైసీపీ ప్రభుత్వం ఆయనని ఏదో కేసులో ఇరికించి జైల్లో పడేయొచ్చు. అంతకి మించి ఆయనకి జరిగే నష్టం ఉండదు.

ఇక ఆనం రామనారాయణ రెడ్డి కూడా తమ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడంలో దారుణంగా విఫలమైందని సభాముఖంగానే చెపుతున్నారు. ఆయన మాజీ మంత్రి, రాజకీయాలలో, వైసీపీలో చాలా సీనియర్ నేత. కనుక ఆయన చేస్తున్న ఈ విమర్శలు, ఆరోపణలని యావత్ రాష్ట్ర ప్రజలు నిశితంగానే గమనిస్తున్నారు.

వైసీపీలో ఇటువంటి అసంతృప్తవాదులు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలీదు కానీ ఏదోరోజు ఒకరొకరుగా బయటపడకమానరు. కనుక తమ ప్రభుత్వం, పరిపాలన, రాష్ట్రాభివృద్ధి, ఆర్ధిక పారిశ్రామికాభివృద్ధి గురించి మంత్రులు ఎంతగొప్పగా డప్పుకొట్టుకొంటున్నా, రఘురామకృష్ణరాజు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటివారు వాస్తవాలు ప్రజలకి తెలియజెప్పుతూనే ఉన్నారు. కనుక బయట ఉన్న శత్రువులు సరిపోరన్నట్లు పార్టీలో అంతర్గతంగా కూడా శత్రువులని తయారుచేసుకొని బయటకి పంపిస్తుంటే నష్టపోయేది ఎవరు?అని ఆలోచిస్తే మంచిది.